గోషా మహల్ నుంచి రాహుల్ సిప్లిగంజ్ పోటీ…!? వాస్తవమెంత…??
ఎన్నికలంటేనే హంగామా. కొత్త కొత్త నేతలు బయటికొస్తుంటారు. టికెట్ల రేసులో నిలుస్తుంటారు. అదృష్టం వరిస్తే ఎక్కడికో వెళ్లిపోతుంటారు. అలా అనుకోకుండా రాజకీయాల్లోకి ప్రవేశించి అత్యున్నత శిఖరాలు అందుకున్న నేతలెంతో మంది ఉన్నారు. అలాంటి అదృష్టం వరిస్తే బాగుండునని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో కొత్త కొత్త పేర్లు బయటికొస్తున్నాయి. అలా బయటికొచ్చిన పేర్లలో రాహుల్ సిప్లిగంజ్ ఒకరు. గోషా మహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగబోతున్నారని కొంతకాలంగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ విన్నర్ గా సుపరిచితులు. ఆ తర్వాత ఆస్కార్ అవార్డు అందుకున్న నాటు నాటు పాట పాడిన వాళ్లలో ఒకడు. అలా రాహుల్ సిప్లిగంజ్ రేంజ్ ఎంతో ఎత్తుకు ఎదిగింది. గల్లీ నుంచి గొప్ప స్థాయికి ఎదిగిన సింగర్ గా సిప్లిగంజ్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికీ ఓల్డ్ సిటీలో సిప్లిగంజ్ ను గల్లీపోరడిగానే చూస్తారు. రాహుల్ సిప్లిగంజ్ కూడా అలా చెప్పుకునేందుకు సంతోషిస్తారు. రాహుల్ సిప్లిగంజ్ క్రేజ్ చూసిన కొంతమంది.. ఆయన్ను రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. అంతటితే ఆగకుండా వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నారని ప్రచారం మొదలు పెట్టారు.
సింగర్ గా రాహుల్ సిప్లిగంజ్ సుపరిచితులు. ఆ మధ్య బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి ఓ సాంగ్ రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఆయన బీఆర్ఎస్ కు దగ్గరవుతున్నారనే ప్రచారం జరిగింది. తాజాగా గోషా మహల్ అసెంబ్లీ నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థిని అనౌన్స్ చేయలేదు. ఇక్కడ బీజేపీ తరపున రాజాసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన్ను ఎదుర్కొనే నాయకుడి కోసం బీఆర్ఎస్ వెతుకుతోంది. అక్కడి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పోటీ చేయబోతున్నారని.. త్వరలోనే అతడిని అభ్యర్థిగా అనౌన్స్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వ్యాఖ్యలపై రాహుల్ సిప్లిగంజ్ స్పందించారు.
తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదని రాహుల్ సిప్లిగంజ్ స్పష్టం చేశారు. తాను గోషా మహల్ నుంచి పోటీ చేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అవన్నీ ఫేక్ అని కొట్టిపారేశారు. తాను అన్ని రాజకీయ పార్టీల నేతలను గౌరవిస్తానని చెప్పారు. తాను ఆర్టిస్ట్ అని.. అలాగే జీవితాంతం ఉంటానని రాహుల్ చెప్పారు. మీడియాలో తన గురించి ఎందుకు ఇలాంటి ఫేక్ న్యూస్ వస్తున్నాయో తనకు అర్థం కావడం లేదన్నారు. అలాంటి రూమర్స్ ఆపాలని సూచించారు. సంగీతంలోనే తన కెరీర్ కొనసాగిస్తానని రాహుల్ స్పష్టం చేశారు. ఏ రాజకీయ నేతా తనను కలవలేదని.. నేను కూడా వారిని కలవలేదని తేల్చి చెప్పారు. కాబట్టి ఇలాంటి రూమర్స్ ఆపాలని సూచించారు. దీంతో రాహుల్ రాజకీయ ప్రవేశంపై క్లారిటీ వచ్చినట్లయింది.













