తెలంగాణలో మరోసారి అయ్యర్ కమిటీ పర్యటన

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ రాష్ట్రంలో మరో దఫా పర్యటించింది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ హైదరాబాద్‌కు చేరుకుంది. మూడు ఆనకట్టల బాధ్యతలు నిర్వహించిన ఇంజినీర్లతో ఎర్రమంజిల్‌లోని జలసౌధలో సమావేశమైంది. గత పర్యటనలో క్షేత్రస్థాయిలో ఆనకట్టలను పరిశీలించిన కమిటీ, కొంత మంది ఇంజినీర్లతోనూ సమావేశమైంది. ఆనకట్టల డిజైన్స్, ప్లానింగ్, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, నిర్వహణ తదితర వివరాలు తీసుకొంది. గత పర్యటనకు కొనసాగింపుగా ఇవాల్టి నుంచి మూడు రోజుల పాటు పర్యటించనుంది. ఈఎన్సీ జనరల్, హైడ్రాలజీ, సెంట్రల్ డిజైన్స్ విభాగాలతో సమావేశం కానుంది. ఇంజినీర్లతో విడివిడిగా భేటీ కానున్న కమిటీ పదవీ విరమణ చేసిన, బదిలీ అయిన వారినీ హాజరు కావాలని పేర్కొంది.