తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న మైనంపల్లి వ్యవహారం!
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మైనంపల్లి హనుమంతరావు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. మైనంపల్లి హనుమంతరావుకు టిఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించింది. అయితే తన పోటీ చేయాలా లేదా అనే అంశంపై ఆయన ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు కేటాయించిన తర్వాత కూడా మైనంపల్లి చేసిన కామెంట్స్ పై టిఆర్ఎస్ అధిష్టానం ఆగ్రహంతో ఉంది. దీంతో ఆయన కేటాయించిన టికెట్ ను రద్దుచేసి మరొకరిని ఆస్థానం నుంచి పోటీ చేయించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. దీంతో ఈ వ్యవహారం ఎటు తిరుగుతుందో అని ఉత్కంఠ నెలకొంది.
మైనంపల్లి హనుమంతరావు సీనియర్ నేత. తెలుగుదేశం పార్టీలో రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించి అంచలంచలుగా ఎదిగారు. రాష్ట్ర విభజన అనంతరం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బి ఆర్ ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో మల్కాజ్గిరి అసెంబ్లీ స్థానం నుంచి టిఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు దాదాపు సిట్టింగ్ లందరికీ కెసిఆర్ మరోసారి టికెట్లు కేటాయించారు. అందులో భాగంగానే మైనంపల్లి హనుమంతరావుకు కూడా మల్కాజిగిరి నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు కేసీఆర్.
అయితే మైనంపల్లి హనుమంతరావు తనతో పాటు తన కుమారుడికి టికెట్ కేటాయించాలని చాలాకాలంగా కేసీఆర్ ను కోరుతూ వస్తున్నారు. తన కుమారుడు మైనంపల్లి రోహిత్ కు మెదక్ అసెంబ్లీ సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కొంతకాలంగా మైనంపల్లి రోహిత్ మెదక్ లో యాక్టివ్ గా ఉంటున్నారు. అక్కడ నిత్యం ఏవో ఒక కార్యక్రమాలు చేస్తూ హడావుడి చేస్తున్నారు. దీంతో తన కుమారుడికి కూడా టికెట్ దక్కుతుందని మైనంపల్లి హనుమంతరావు భావించారు. అయితే మైనంపల్లి రోహిత్ ను కాదని సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికే టికెట్ ఇచ్చారు కేసీఆర్.
మంత్రి హరీష్ రావు జోక్యం వల్లే తన కుమారుడికి టికెట్ రాలేదని మైనంపల్లి హనుమంతరావు భావిస్తున్నారు. అందుకే హరీష్ రావును ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. కెసిఆర్ టికెట్లు అనౌన్స్ చేసే ఒక్కరోజు ముందు మైనంపల్లి హనుమంతరావు మంత్రి హరీష్ రావు పైన సీరియస్ కామెంట్స్ చేశారు. హరీష్ రావు ఓడిపోయేంతవరకు నిద్రపోయేది లేదని ప్రకటించారు. మైనంపల్లి బహిరంగంగా చేసిన ఈ కామెంట్స్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కేటీఆర్ తో పాటు కవిత కూడా మైనంపల్లి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అయినా కెసిఆర్ మైనంపల్లికి మల్కాజిగిరి స్థానం ఇచ్చారు.
తర్వాత కూడా మైనంపల్లి హనుమంతరావు శాంతించలేదు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. తనకు, తన కుమారుడికి మంచి పట్టు ఉందని ఇద్దరికీ కేటాయిస్తే ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మైనంపల్లి స్వరంలో మార్పు రాకపోవడంతో కెసిఆర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. మైనంపల్లికి టికెట్ రద్దుచేసి దాన్ని మరొకరికి కేటాయించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. మైనంపల్లి బహిరంగంగా చేసిన కామెంట్స్ పై షోకాజ్ నోటీస్ ఇచ్చింది టీఆర్ఎస్ అధిష్టానం. దీన్ని సాకుగా చూపి మైనంపల్లి పైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే టిఆర్ఎస్ పార్టీ తనను బహిష్కరిస్తే ఎలాంటి అడుగులు వేయాలని మైనంపల్లి ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం ఉన్నా తండ్రి కొడుకులు ఇద్దరికీ టికెట్ కేటాయించే అవకాశం అక్కడ కూడా లేనట్టు తెలుస్తోంది. మరి మైనంపల్లి వ్యూహం ఎలా ఉంటుందో అని ఉత్కంఠ నెలకొంది.













