సోనియా గాంధీతో ఎంపీ కోమటిరెడ్డి భేటీ
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి భేటీ అయ్యారు. టీపీసీసీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. నాకు పీసీసీ ఇవ్వామంటూ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పలుమార్లు బహిరంగంగానే డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక జరుగుతోంది. టీపీసీసీ రేసులో ఉన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ కాంగ్రెస్ పెద్దలను కలుస్తున్నారు. తానుం ఎంపీ అయినప్పటికీ పీసీసీ ఇస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కి పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చినట్టే తనకు ఇచ్చినా ఇబ్బంది ఉండబోదంటున్నారు. మొదట నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న మనిషికే అధ్యక్ష పదవి ఇవ్వాలని కోమటిరెడ్డి కోరుతున్నారు. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలు ఎంతకాలం పార్టీలో ఉంటారో తెలియదని, పార్టీ ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే చూసుకుంటారని కోమటిరెడ్డి వాదిస్తున్నారు.













