ఎన్టీఆర్ బయోపిక్ విజయవంతం కావాలి : కవిత
బాలకృష్ణ ప్రధానపాత్రగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ విజయవంతం కావాలని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఇండో అమెరికన్ బసవతారకం కేన్సర్ ఆస్పత్రి వార్షికోత్స వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా ఎంపీ కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తండ్రి ఎన్టీఆర్ నుంచి బాలకృష్ణ నటనతో పాటు ఆయన సేవాస్ఫూర్తిని కూడా పుణికిపుచ్చుకున్నారని అన్నారు. నిరుపేదలకు వైద్యసేవలు అందించేందుకు ఎన్టీఆర్ బసవతారకం ఆస్పత్రిని స్థాపిస్తే, బాలకృష్ణ దాన్ని ప్రపంచస్థాయిలో విస్తరించారని కొనియాడారు. కేన్సర్ మహమ్మారిని ఎదుర్కోవడానికి అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజల ఆరోగ్యంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. బోదకాలు వ్యాధితో బాధపడుతున్నవారికి పెన్షన్ ఇస్తునన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా కిడ్నీ రోగులకు సర్కారు బాసటగా ఉందన్నారు. ఎంఎన్‌జే ఆస్పత్రిలో ఆధునిక చికిత్సా విధానాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ట్రస్ట్ బోర్డులను పన్ను మినహాయింపు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోందన్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ కేన్సర్ బారిన పడుతున్న వారిలో చాలామంది భయంతోనే మరణిస్తున్నారని అన్నారు. వ్యాధిపై ప్రజల్లో అవగాహన వస్తే చికిత్స సులువవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సినీనటి శ్రియ, దర్శకుడు బోయపాటి శ్రీను, ఆస్పత్రి సీఈవో ప్రభాకర్ రావు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.













