అధ్యక్షులను మార్చినా బీఆర్ఎస్ .. హ్యాట్రిక్ విజయం
ఐటీ సేవల విస్తరణకు పటాన్చెరు కేంద్రం కాబోతోందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో పర్యటించిన ఆయన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఫ్రీడం పార్కు, గ్రేటర్ డివిజన్ కార్యాలయం, డీసీసీబీ బ్యాంకు కార్యాలయం, ఆర్ అండ్ బీ అతిథి గృహాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రతిపక్షాలు అధ్యక్షులను మార్చినా బీఆర్ఎస్ హాట్రిక్ విజయం తథ్యమని తెలిపారు. కాలం చెల్లిన నాయకులకు పట్టం కట్టినా బీఆర్ఎస్ విజయం తప్పదని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్ర మోసం చేసిందని ఆరోపించారు. దక్షణ భారత్‌పై బీజేపీకి చిన్నచూపు ఎందుకు అర్థం కావడం లేదన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. మళ్లీ గెలిచిన తర్వాత పటాన్చెరు దాకా మెట్రో తీసుకొస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.













