KTR: ఫోన్ ట్యాపింగ్ జరగలేదు.. సిట్ విచారణకు భయపడేది లేదన్న కేటీఆర్..!
ఫోన్ ట్యాపింగ్ అసలు జరగనే లేదన్నారు బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ను విచారణకు సిట్ పిలిస్తే.. హుందాగా హాజరై సహకరించారన్నారు. కేసీఆర్ చట్టం ద్వారా మినహాయింపులు కోరే ఛాన్సున్నా.. ఎలాంటి ప్రమేయం లేదు కాబట్టి, సిట్ విచారణకు హాజరైన ప్రశ్నలకు బదులిచ్చారన్నారు. ఈ విచారణకు మరికొన్ని సార్లు పిలవొచ్చని.. అయితే ఎన్నిసార్లు పిలిచినా హాజరైన బదులిస్తామన్నారు. అంతేకాదు.. సిట్ విచారణను హిట్ సినిమా సీక్వెల్స్ తో పోల్చారు.
తెలంగాణ కోసం సుదీర్ఘ పోరాటం చేసిన సాధించుకున్న ధీశాలి కేసీఆర్ అన్నారు. ఈ రాష్ట్రం కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా వెనకడుగు వేసే వ్యక్తి కేసీఆర్ అని గుర్తించారు. చిల్లర రాజకీయాలకు, నీచమైన ఎత్తుగడలకు కేసీఆర్ భయపడే వ్యక్తి కాదన్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలనుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంత విషం చిమ్మినా.. ఆయనను ఎవరూ ఏమీ చేయలేరన్నారు.
రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గురించి మూడు ముక్కల్లో చెప్పాలి అంటే డైవర్షన్, సబ్వర్షన్, పర్వర్షన్. అటెన్షన్ డైవర్ట్ చేయడం అన్నారు కేటీఆర్. తమ చేతకానితనాన్ని సబ్వర్ట్ చేయడం, పర్వర్ట్ రాజకీయాలు చేయడం. రాష్ట్రంలో రెండేళ్లుగా కాంగ్రెస్ పరిపాలన తీరు ఇలానే ఉంది’ అని కేటీఆర్ విమర్శించారు. ‘సిట్ చట్టాన్ని గౌరవించలేదు.. బీఎన్ఎస్ చట్టాన్ని.. అందులో పొందుపరిచిన నిబంధనలు కూడా గౌరవించలేదు’ అని ఆరోపించారు. కానీ తాము ఒక బాధ్యత కలిగిన పార్టీగా.. తెలంగాణ ప్రజల గొంతుగా, తెలంగాణ ప్రజల ప్రతినిధిగా పెద్దలు కేసీఆర్ విచారణకు హాజరయ్యారని కేటీఆర్ తెలిపారు. రేవంత్ రెడ్డి(CM REVANTH REDDY) ఆదేశానుసారం సిట్ నడుస్తోందని.. ఆయన ఏం అడగమంటే.. అవే ప్రశ్నలను సిట్ బృందం అడుగుతోందని మండిపడ్డారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు జారీచేయడమనేది రేవంత్‌ర్డెడి చిల్లర రాజకీయాలకు పరాకాష్ఠ అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ జాతి పిత, కోట్లాదిమంది ప్రజల ఆరాధ్యుడు కేసీఆర్ పై రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్‌ని టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే రేవంత్.. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి, దశాబ్దకాలం పాటు తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానేత కేసీఆర్.. అలాంటి చరిత్రాత్మక నాయకుడిపై బురద చల్లాలని ప్రయత్నించడం సూర్యునిపై ఉమ్మి వేయడమేనని మండిపడ్డారు.
పరిపాలనలో చేతకానితనంతో ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, సింగరేణి బొగ్గు కుంభకోణం మరకల నుంచి దృష్టి మళ్లించేందుకు సిట్ పేరుతో నోటీసులు జారీ చేయడం రేవంత్ రెడ్డి చిల్లర, చౌకబారు రాజకీయాలకు పరాకాష్ట అని ఆరోపించారు హరీశ్ రావు.. ఇలాంటి రాజకీయ వేధింపులతో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావించడం రేవంత్ రెడ్డి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం అన్నారు. చరిత్రను సృష్టించినవాడు కేసీఆర్ అయితే, ఆ చరిత్రను మలినం చేయాలని చూస్తున్న చరిత్రహీనుడు రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు హరీశ్ రావు.. అధికారం శాశ్వతం కాదు.. అహంకారం అంతకంటే కాదు.. తెలంగాణ సమాజమంతా కేసీఆర్ గారి వెంటే ఉంది.. మీ రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదు.. ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.






