గవర్నర్ కోటా ఎమ్మెల్సీకి కోదండరామ్ తగరా…?
తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలతో గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా కోదండరామ్‌ను రాజ్ భవన్ నియమించడం వివాదాస్పదంగా మారింది. గతంలో తాము దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణల నియామకాన్ని నిలిపివేసిన గవర్నర్.. ఇప్పుడు ఓ పార్టీ అధ్యక్షుడైన కోదండరామ్‌ను ఎలా నియమిస్తారని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. తమకో న్యాయం, కాంగ్రెస్‌కు మరోన్యాయమా అని నిలదీస్తోంది.అంతేకాదు..గవర్నర్ కాంగ్రెస్ ఏజెంట్ లా ప్రవర్తిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
ఈఆరోపణలను కాంగ్రెస్ అంతేధీటుగా తిప్పికొడుతోంది. ఉద్యమకాలంలో కర్తవ్యదీక్షతో పనిచేసిన కోదండరామ్‌ను..బీఆర్ఎస్ అవమానపరుస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఉద్యమకాలంలో పదేపదే కోదండరామ్ ఇంటికి వెళ్లిన బీఆర్ఎస్ నేతలు..తర్వాతి కాలంలో ఆయన్ను పూర్తిగా పక్కన పెట్టేశారన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. అంతేకాదు.. పదేళ్ల పాలనలో కనీసం ఒక్కఅప్పాయింట్ మెంట్ కూడా కేసీఆర్ ఇవ్వలేదని ఆరోపించారు.
కేసీఆర్ అండ్ కో.. ప్రొఫెసర్ కోదండరామ్‌ను అవమానిస్తే..తాము గౌరవిస్తున్నామన్నారు జగ్గారెడ్డి. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసి గౌరవిస్తుంటే..దానిపైనా విమర్శలు ఏంటంటున్నారు కాంగ్రెస్ నేతలు. మేం చేసిన దాన్ని మనసులోనైనా బీఆర్ఎస్ నేతలు అభినందించాలంటున్నారు. అంతేకానీ.. ఇలా గుడ్డిగా వ్యతిరేకించడం తగదంటున్నారు.
అయితే ఈఅంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. ముఖ్యంగా యూత్, ఉద్యమ కారుల్లో కోదండరామ్‌కు ఉన్న సానుకూలదృక్పథాన్ని.. వచ్చే ఎన్నికల్లో ఓట్లరూపంలో మార్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే కోదండరామ్ ను ఎమ్మెల్సీగా చేయడాన్ని వ్యతిరేకించడం ద్వారా బీఆర్ఎస్ ఏం బావుకుంటుందో అర్థం కావడం లేదు. అనవసరంగా కాంగ్రెస్‌కు మరో అస్త్రం అందించడం తప్ప, ఇంకే ప్రయోజనం కనిపించడం లేదని చెప్పాలి.













