బంగారు తెలంగాణను పక్కనబెట్టి… బంగారు కుటుంబాన్ని
బంగారు తెలంగాణను పక్కనబెట్టి, సీఎం కేసీఆర్ బంగారు కుటుంబాన్ని నిర్మించుకున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను నవ్వులపాలు చేశారని విమర్శించారు. 9 ఏళ్లలో ఒక్కరోజు కూడా ప్రధాని మోదీ సెలవు తీసుకోలేదని, కేసీఆర్ మాత్రం 9 ఏళ్లలో ఒక్కసారి కూడా సచివాలయానికి రాలేదని ఎద్దేవా చేశారు. కుట్రలు చేసి బీజేపీని అణచివేసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కారణంగా లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీని ప్రశ్నించినందుకు అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే హైదరాబాద్లో ఎంఎంటీఎస్ విస్తరణ పనులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఎలాంటి తెలంగాణ కోసం పోరాటం చేశామో ప్రజలు గమనించాలని కోరారు.













