సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా
తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసైకి అధికారుల ద్వారా తన రాజీనామా లేఖను పంపించారు. కేసీఆర్ రాజీనామాను గవర్నర్ తమిళిసై ఆమోదించారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేసీఆర్‌కు గవర్నర్ సూచించారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం లేఖను విడుదల చేసింది. గవర్నర్ రాజీనామా లేఖను పంపించిన అనంతరం కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి బయటకు వచ్చి, ప్రభుత్వ వాహనంలో కాకుండా తన సొంత వాహనంలో గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లిలోని ఇంటికి వెళ్లారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ కేసీఆర్ ఆపద్ధర్మ సీఎం అయినా తన వాహనం వెంట కాన్వాయ్‌ను భద్రతా సిబ్బందిని రావొద్దని సూచించినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014 జూన్ 2 నుంచి 2023 డిసెంబరు 3 వరకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.













