పుట్టినరోజు వేడుకలకు సీఎం కేసీఆర్ దూరం
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి ఘటనను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల దాడిలో అనేక మంది జవాన్లు మృతి చెందడంతో పాటు చాలా మందికి తీవ్రగాయాలవడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేలుడులో మృతి చెందిన జవాన్ల కుటుంబాకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కశ్మీర్లో జరిగిన దాడి నేపథ్యంలో దేశ ప్రజలంతా విషాదంలో మునిగిపోయారు. తాను కూడా తీవ్రంగా మనస్థాపానికి గురయ్యానన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ నెల 17న తన పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి వేడుకలు జరుపుకోరాదని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ తన పుట్టినరోజు వేడుకలు జరపవద్దని ముఖ్యమంత్రి అభ్యర్థించారు. పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని, ఉగ్రవాదులు జరిపిన పేలుడులో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడిన విషయం తెలిసిందే.













