జయ్ తాళ్ళూరి మరో సహాయం… ఆడిటోరియం నిర్మాణం
‘తానా’ మాజీ అధ్యక్షులు జయ్ తాళ్లూరి జన్మభూమిలో సహాయ కార్యక్రమాలను ముమ్మరంగా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తన తల్లిదండ్రుల పేరు మీద తను చదువుకున్న తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచల ప్రభుత్వ కళాశాలలో ఆడిటోరియంను సకల వసతులతో నిర్మించి ఇచ్చారు. జయ్ తాళ్లూరి కుటుంబ సభ్యులందరూ సకుటుంబంగా వెళ్లి మరీ ఆడిటోరియం ప్రారంభించడం విశేషం. ఈ ఆడిటోరియం భద్రాచల ప్రభుత్వ కళాశాల విద్యార్థులకే కాకుండా భద్రాచలం పట్టణంలోని అన్ని వర్గాలవారికి ఉపయోగపడేలా తీర్చిదిద్దారు.
ఈ ఆడిటోరియంలోనే భద్రాద్రి కళాభారతి సంస్థ వారు నిర్వహించే అంతర్ రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలు ఈ మధ్యనే ఘనంగా నిర్వహించారు. ఈ రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలను తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ గత 20 సంవత్సరాలుగా స్పాన్సర్ చేస్తోంది. నాటకోత్సవ సాంస్కృతిక సంబరాలలో ముఖ్య అతిథిగా గా పాల్గొన్న జయ్ తాళ్లూరి నాటకరంగ కళాకారులను సత్కరించారు. ఈ సభలో ప్రసంగిస్తూ భద్రాచల ప్రభుత్వ కళాశాలలో నిర్మించిన ఆడిటోరియం ఈ విధంగా ఉపయోగపడడం సంతోషంగా ఉందని, మొదటినుంచి కూడా నాటకరంగం సభ్యసమాజానికి మంచి సందేశాలందిస్తుందని జయ్ తాళ్లూరి కొనియాడారు.
జయ్ తాళ్లూరి తండ్రి, ప్రముఖ సంఘ సేవకులు, భద్రాద్రి కళాభారతి గౌరవ అధ్యక్షులు తాళ్లూరి పంచాక్షరయ్య మాట్లాడుతూ అంతరించిపోతున్న నాటక కళలను బతికించుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. మార్పు ఒకచోట మొదలైతే వాటి ప్రతిఫలాలు ఏదో ఒక రోజు అందరికీ అందుతాయన్నారు. భద్రాచల ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో అందరికీ ప్రాయోజితమైన ఇటువంటి మంచి ప్రాజెక్ట్ విషయంలో సహకరించిన భద్రాద్రి కళాభారతి వ్యవస్థాపకలు అల్లం నాగేశ్వరరావు మరియు వారి టీంకి జయ్ తాళ్లూరి ధన్యవాదాలు తెలియజేశారు.













