సీఎం కేసీఆర్ వినకపోవడం వల్లే.. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు
కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజినీర్లు చెప్పినా సీఎం కేసీఆర్ వినకపోవడం వల్లే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న రూ.వేల కోట్ల విలువైన పంప్ హౌస్లు వరద నీటిలో మునిగిపోయాయని, అయినా ఎంతో అనుభవం ఉన్న ఇంజినీర్లు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదని అన్నారు. సీఎం కేసీఆర్ కూడా గతంలో తానే పెద్ద ఇంజనీర్ అని చెప్పారని గుర్తుచేశారు. కాళేశ్వరంలో వేలాది ఎకరాల పంట పొలాలు భూసేకరణతో సంబంధం లేకుండా మునుగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మొదటిసారి మంథని, మంచిర్యాల పట్టణాలు మునిగిపోయే పరిస్థితి వచ్చిందన్నారు.
ఒక్కసారి ముంపునకు గురైతే పదేళ్లు అయినా కోలుకోలేరు. బాధితులు ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉంటుంది. గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వం భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంజినీర్లు శాశ్వత చర్యల గురించి ఆలోచన చేయాలి. నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ బాధ్యత లేకుండా, ఇంత పెద్ద ఎత్తున వరదలు వస్తే విదేశాలకు వెళ్లారు. నీటిపారుదల శాఖ సీఎం పరిధిలో ఉందన్నారు. రైతులకు కాళేశ్వరం ప్రాజెక్టు శ్రీరామరక్ష అని అనడంలో నిజం లేదన్నారు. వాస్తవానికి తెలంగాణ వచ్చాక మంచి వర్షాలు పడటం వల్లే పంటలు పండుతున్నాయి అని ఈటల పేర్కొన్నారు.













