బీజేపీ గ్రాఫ్ పెరగడానికి బీఆర్ఎస్ పాపాలే కారణం: సీపీఐ నారాయణ

తెలంగాణలో కాంగ్రెస్ పోరాటం ఎప్పుడూ బీజేపీతోనే ఉండాలని, అంతేకానీ బీఆర్ఎస్‌పై విమర్శలు చేసి ఉపయోగం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సూచించారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పెరగడానికి బీఆర్ఎస్ పార్టీ చేసిన పాపాలే కారణమన్నారు. ‘‘బీజేపీ ప్రభుత్వంలో నియంతృత్వ ధోరణి పెరిగిపోయింది. ఎదురు ప్రశ్నించిన వారిని జైలుకు పంపించడం, ఈడీ, సీబీఐలతో దాడులు చేయించడమే పనిగా పెట్టుకుంది. ప్రభుత్వరంగ సంస్థలన్నింటనీ బీజేపీ నిర్వీర్యం చేస్తోంది. దీనివల్ల దర్యాప్తు సంస్థలపై ప్రజలకు నమ్మకం కూడా పోతుంది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కాంను కూడా బీజేపీ సర్కార్ రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఓ సాధనంగా వాడుతోంది’’ అంటూ నారాయణ మండిపడ్డారు. అనంతరం బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంపై స్పందిస్తూ.. రాజకీయ కుట్రలో భాగంగా రేవ్ పార్టీతో సంబంధం లేని వ్యక్తులను బజారుకీడ్చడం సమంజసం కాదని హితవు పలికారు. అసలు ఆ పార్టీకి ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చాయో.. వాటి మూలాలేంటో ముందు తెలుసుకోవాలని డిమాండ్ చేశారు.