కాంగ్రెస్ ఖాతాలోకి లింగోజీగూడ

జీహెచ్‌ఎంసీలో పరిధిలోని లింగోజీగూడ సీటును ఎలాగైనా గెలిచి తీరుతామన్న బీజేపీ ఆశలు ఆవిరయ్యాయి. వారి ఆశలపై కాంగ్రెస్ పార్టీ నీళ్లు జల్లింది. అనూహ్యంగా ఈ సీటు కాంగ్రెస్ పార్టీ వశమైంది. ఆ పార్టీ అభ్యర్థి రాజశేఖర రెడ్డి బీజేపీ అభ్యర్థి మందుగుల అఖిల్ గౌడ్‌పై గెలుపొందారు. మొత్తం 13,629 ఓట్లు పోలవ్వగా, 13,340 ఓట్లను వ్యాలిడ్ ఓట్లుగా పరిగణించారు. కాంగ్రెస్ అభ్యర్థికి 7,240 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 5,968 ఓట్లు వచ్చాయి. మొన్నటికి మొన్న జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఆకుల రమేశ్ విజయం సాధించారు. అయితే ఆయన మరణించారు. దీంతో లింగోజీగూడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎలాగైనా తాము గెలుస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. తీరా ఫలితం చూసే సరికి కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ డివిజన్‌కు ఉప ఎన్నికల్లో ఏకగ్రీవం కావాలని బీజేపీలోని ఓ వర్గం మంత్రి కేటీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసింది. ఈ పరిణామం బీజేపీలో దుమ్ము దుమారమే రేపింది. బీజేపీ చేసిన విజ్ఞప్తి మేరకు పోటీకి దూరంగా ఉండాలని టీఆర్‌ఎస్ నిర్ణయించుకుంది.