కాపు ప్రముఖులతో కేసీఆర్ భేటీ..! జగన్ కోసమేనా…!?
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ పై తెలంగాణలో కూడా ఎంతో ఆసక్తి నెలకొంది. అక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ముఖ్యంగా జగన్ ను గద్దె దించేందుకు టీడీపీ, జనసేన కంకణం కట్టుకోవడంతో అది జరుగుతుందా.. లేదా.. అనే ఆసక్తి ఏర్పడింది. సోదర రాష్ట్రం కావడంతో ఆక్కడ ప్రభావం ఇక్కడ, ఇక్కడి ప్రభావం అక్కడ ఉండడం చాలా కామన్. విడిపోయినా రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలను అంత ఈజీగా కొట్టిపారేయలేం. పొరుగు రాష్ట్రంలో కూడా తమకు అనుకూల ప్రభుత్వం రావాలని తెలంగాణ నేతలు కోరుకోవడం చాలా కామన్. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే ఆలోచనలో ఉన్నారనే టాక్ నడుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు అక్కడ అధికారంలోకి వచ్చారు. తెలంగాణలో కేసీఆర్ పగ్గాలు చేపట్టారు. అయితే రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య అస్సలు లేదు. అన్ని అంశాల్లోనూ కొర్రీలే. ఉమ్మడి ఆస్తుల విభజన, బకాయిల చెల్లింపు, విద్యుత్ పంపిణీ, భవనాల కేటాయింపు.. లాంటి అనేక అంశాల్లో రెండు రాష్ట్రాల మధ్య వార్ నడిచింది. అమరావతికి తరలిపోయినా కూడా హైదరాబాద్ లోని భవనాలను తెలంగాణకు ఇచ్చేందుకు నాటి సీఎం చంద్రబాబు అంగీకరించలేదు. పైగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అండతో సీఎం కేసీఆర్ పై ఒత్తిడి తెచ్చి పనులు చేయించుకునేవారు. చంద్రబాబు హయాంలో తెలంగాణ కంటే ఏపీకి ఎక్కువ ప్రయారిటీ ఉండేది.
చంద్రబాబు హయాంలో కేసీఆర్ పప్పులుడికేవి కావు. అందుకే చంద్రబాబు ఓడిపోవాలని బలంగా కోరుకున్నారు. అలాగే జరిగింది. 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చారు. రాగానే హైదరాబాద్ లోని ప్రగతి భవన్ కు వచ్చి ఆతిథ్యం స్వీకరించారు. అలాగే కేసీఆర్ కూడా తాడేపల్లి వెళ్లి వచ్చారు. హైదరాబాద్ లోని భవనాలను అడగ్గానే ఇచ్చేశారు. ఇద్దరి మధ్య ఎంతో సఖ్యత నెలకొంది. అయితే ఇది ఎంతోకాలం నిలవలేదు. లోటు బడ్జెట్లో ఉన్న ఏపీ.. విభజన హామీలపై గట్టిగా పట్టు బట్టడంతో తెలంగాణకు నచ్చలేదు. దీంతో ఇద్దరిమధ్య గ్యాప్ పెరిగింది. అయినా చంద్రబాబుతో పోల్చితే జగనే బెటర్ అనే అభిప్రాయం కేసీఆర్ లో ఉంది. మళ్లీ ఆయనే రావాలని కేసీఆర్ కోరుకుంటున్నట్టు సమాచారం.
ఇందుకోసం తనవంతు సాయం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఆదివారం పలువురు కాపు ప్రముఖులను సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ కు పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ పైనే ఎక్కువగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కాపు ఓట్లు చీలకుండా జాగ్రత్తపడాలని సూచించినట్టు తెలుస్తోంది. పవన్ ఒంటరిగా పోటీ చేస్తే సీఎ అయ్యే అవకాశాలుంటాయని, ఆ మేరకు పవన్ కల్యాణ్ ను ప్రోత్సహించాలని కేసీఆర్ సలాహా ఇచ్చారని తెలుస్తోంది. అంతేకాక టీడీపీతో పొత్తు పెట్టుకోవద్దని.. ఒంటరిగా ఎదిగేలా చూడాలని చెప్పారట. ఒకవేళ ఇదే జరిగితే జగన్ కు మేలు జరుగుతుంది. జగన్ కోసమే కేసీఆర్ ఈ సమావేశాన్ని పెట్టారనే టాక్ నడుస్తోంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో.. ఏం జరుగుతందో.. మున్ముందు చూడాలి.













