సీఎం కేసీఆర్ చేతుల మీదుగా టీ హబ్-2 ప్రారంభం
దేశంలోనే ప్రతిష్టాత్మకమైన స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్`2 ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 28న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా టీహబ్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభం కానుంది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కొత్తగా నిర్మించిన ఫెసిలిటీ సెంటర్ హైదరాబాద్ ఇన్నోవేషన్ ఎకో సిస్టంకు ఊతమిస్తుందని అన్నారు. టీ హబ్ 2ను రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రమాణాలతో అత్యంత విశాలమైన ప్రాంగణంలో, అత్యాధునిక మౌలిక వసతులతో నిర్మించిన విషయం తెలిసిందే. రాయదుర్గం నాలెడ్జి సిటీలో సుమారు 5.82 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దారు. రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 2015 గచ్చిబైలి ట్రిపుల్ ఐటీ క్యాంస్ టెక్నాలజీ హబ్ ( టీ హబ్)ను ఏర్పాటు చేశారు. గత ఆరేండ్లలో వివిధ కార్యక్రమాల ద్వారా 1,800 స్టార్టప్‌లను టీ హబ్ ప్రోత్సహించింది.
ఈ భవన ప్రారంభోత్సంలో దేశ, విదేశాలకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు పాల్గొంటారు. టీ హబ్ ప్రారంభించాక ఇన్నోవేషన్ సదస్సును నిర్వహించనున్నారు. ఈ సదస్సులో ఐటీ, స్టార్టప్ రంగ నిపుణులు, స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టే వెంచర్ క్యాపిటలిస్టులు, పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.













