అనతికాలంలోనే తెలంగాణ అద్భుతమైన ప్రగతి : సీఎం కేసీఆర్
అనతికాలంలోనే తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మెదక్ కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాకముందు పరిపాలన చేతకాదని విమర్శించారు. పరిపాలన సజావుగా సాగుతుందనేందుకు ఈ కార్యాలయాలే నిదర్శనం. దేశం, రాష్ట్రం జిల్లా, పట్టణం ఏ స్థాయిలో ఉందని తెలుసుకునేందుకు డెవలప్మెంట్ ఇండెక్స్ ఉంటుంది. 70-75 ఏళ్లుగా రాష్ట్రాలుగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటకను కూడా అధిగమించి తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.
విద్యుత్ వినియోగంలో కూడా భారత దేశలో నెంబర్ వన్ స్థానంలో ఉంది. పరిశుభ్రమైన తాగునీరు అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. అన్ని రంగాలకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ అందిస్తున్న రాష్ట్రంలో దేశంలో తెలంగాణ మాత్రమే. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా దివ్వాంగుల పింఛను రూ.3 వేల నుంచి 4,016కు పెంచుకున్నాం. రాబోయే రోజుల్లో మరింత ఆర్థిక ప్రగతి సాధించి మరింత పెంచుకుంటాం. తెలంగాణ రాకముందు 24 లక్షల పింఛన్లు మాత్రమే. తెలంగాణ ఏర్పడిన తర్వాత దాదాపు 50 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. తెలంగాణ ఆర్థిక ప్రగతి సాధించింది కాబట్టే సంక్షేమ పతకాలు అందిస్తున్నాం అని అన్నారు.













