సిట్టింగ్‌లందరికీ మళ్లీ సీట్లు : కేసీఆర్
ప్రస్తుతం తమ పార్టీలోని సిట్టింగ్ ఎమ్యెల్యేలందరికీ సీట్లు ఇస్తామనీ, ఎవరినీ మార్చే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా డైమండ్స్ అనీ 30 శాతం ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వరంటూ మీడియాలో వస్తున్న కథనాలు వాస్తవం కాదనీ, అలాగే, కేబినెట్లోనూ ఎలాంటి మార్పులు ఉండవని సృష్టం చేశారు. కొంపల్లిలో జరిగిన టీఆర్ఎస్ 17వ ప్లీనరీ ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. దేశ చరిత్రలో ఎవరూ ప్రవేశపెట్టని పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నామనీ, కాంగ్రెస్ నేతలు దుర్మార్గంగా వందలాది కేసులు పెట్టినా వాటన్నింటికీ త్వరగా అనుమతులు వస్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నప్పటికీ రికార్డు స్థాయిలో ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నామని సృష్టం చేశారు.
త్వరలో స్టేట్ హెల్త్ ప్రొఫైల్ పేరుతో రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ కోసం హైదరాబాద్‌కే రావాల్సి అవసరం లేకుండా రాష్ట్రంలో 40 డయాలసిస్ కేంద్రాలను మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జూన్ నుంచి ప్రతి గ్రామంలో ప్రతీ ఇంటికి నల్లా ద్వారా మంచినీరు అందిస్తామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నీటి పారుదల రంగానికి రూ.37,500 కోట్లు కేటాయించామనీ, అదృష్టవశాత్తూ రాష్ట్రం ప్రతీ ఏటా రూ.10 నుంచి 15వేల కోట్ల వరకూ పెరుగుతోందనీ, వార్షిక బడ్జెట్ రూ.లక్షా 45 వేల కోట్లుగా ప్రవేశపెట్టిన ఘనత దేశంలోనే ఒక్క తెలంగాణ రాష్ట్రానికే దక్కుతుందన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి టీపీసీసీ వచ్చింది గులాబీజెండాతో అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశాన్ని దశాబ్దాల పాటు పాలించడం దేశానికి శాపమన్నారు. దేశ రాజకీయాలలో ప్రభాశీల, క్రియాశీల పాత్ర పోషిస్తామని అన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. మిషన్‌భగీరథ నీరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలైనా జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డిల నియోజకవర్గాల్లోని ప్రతి ఇంటికి ఇస్తామని సృష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల కోసం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం దేశంలో టీఆర్ఎస్ ఒక్కటేననీ, ఈ ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.













