కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం కేసీఆర్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. అమిత్‌షాను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై విజ్ఞప్తులు చేశారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో ఐపీఎస్‌ల కేటాయింపుతో పాటు మరికొన్ని అంశాలను విన్నవించారు. నూతన జిల్లాలు, పోలీస్ కమిషనరేట్లు పెరిగిన నేపథ్యంలో ఐపీఎస్ క్యాడర్‌పై సమీక్ష చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వినతిపత్రం అందించారు. గతంలో 9 జిల్లా పోలీసు కార్యాలయాలు, 2 పోలీసు కమిషనరేట్లు ఉండేవని, ప్రస్తుతం పాలన సౌలభ్యం కోసం జిల్లాల విభజన జరిగినట్లు తెలిపారు.
కొత్తగా 20 జిల్లా పోలీసు కార్యాలయాలు, 9 పోలీసు కమిషనరేట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఐపీఎస్‌ల సంఖ్య పెంచాలని కోరారు. 2016లో ఐపీఎస్ క్యాడర్ సమీక్ష జరిగింది. 76 సీనియర్ డ్యూటీ పోస్టులతో కలిపి మొత్తం 139 ఐపీఎస్ పోస్టులను కేంద్ర హోంశాఖ ఆమోదించింది. ప్రస్తుతం కొత్త జిల్లాలు, కొత్త జోన్లు ఏర్పాటవడంతో కొత్తగా 29 సీనియర్ డ్యూటీ పోస్టులతో పాటు మొత్తం 195 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.













