బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అరెస్టు.. పతాకస్థాయికి పోరు!
తెలంగాణ అసెంబ్లీ వేదికగా మొదలైన ఘర్షణలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు, కులం పేరుతో దూషించారన్న ఆరోపణలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ రెడ్డిని కోకాపేటలోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వీరిద్దరినీ నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
సోమవారం ఉదయం అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ప్రతినిధులు, పోలీసుల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి తాతా మధు తీవ్ర వ్యాఖ్యలు చేశారన్న అంశం రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేపింది. సభాపతిని కులం పేరుతో దూషించడంతో పాటు అసభ్య పదజాలం వాడారంటూ స్పీకర్ ఓఎస్డీ పొల్లెపల్లి వెంకటేశం పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి వేగంగా అరెస్టు ప్రక్రియను పూర్తి చేశారు.
ఈ వ్యాఖ్యల వ్యవహారంపై సోమవారం మధ్యాహ్నం శాసనసభ సుదీర్ఘంగా చర్చించింది. ముఖ్యమంత్రి సహా కేబినెట్ మంత్రులు, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ పక్షాల ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో తాతా మధు తీరును తీవ్రంగా ఖండించారు. సభాపతి పదవికున్న ఔన్నత్యాన్ని కించపరిచేలా వ్యవహరించిన ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని పార్టీలు డిమాండ్ చేశాయి. సభలో జరిగిన ఈ భావోద్వేగపూరిత చర్చ సందర్భంగా శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్ర మనస్తాపానికి గురై కంటతడి పెట్టడం సభ్యులను కదిలించింది. స్పీకర్ స్థానానికి జరిగిన అవమానంగా పరిగణించిన అధికార పక్షం, ఈ వ్యవహారాన్ని రాజకీయంగా, చట్టపరంగా తీవ్రంగా పరిగణించింది. దీంతో తాతా మధు ప్రెస్ మీట్ పెట్టి, తాను స్పీకర్ ను అలా అనలేదని, ఒకవేళ అలా భావించి ఉంటే చింతిస్తున్నానని ప్రకటించారు.
ఇవి కూడా చదవండి
ఎమ్మెల్సీల అరెస్టులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. “ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలవుతాయంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలం అందరం స్వచ్ఛందంగా అరెస్టు కావడానికి సిద్ధం.. మీరు సిద్ధమా?” అంటూ సవాల్ విసిరారు. 1000 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది అక్రమ నిర్బంధాలు, అరెస్టులు మాత్రమేనని ఎద్దేవా చేశారు.
మహిళల పట్ల ప్రభుత్వానికి నిజమైన గౌరవం ఉంటే.. తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిలకు జరిగిన అవమానంపై ఏం చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. హైకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ, ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు బనాయించి తాతా మధు, నవీన్ రెడ్డిలను అరెస్టు చేయడం న్యాయస్థానాలు, చట్టాలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న అగౌరవాన్ని సూచిస్తోందని ఆయన ధ్వజమెత్తారు.
ఈ పరిణామాలు తెలంగాణలో అధికార, విపక్షాల మధ్య అగాధాన్ని మరింత పెంచాయి. స్పీకర్‌పై దూషణలు, దళిత ఆత్మగౌరవం అంశాన్ని తెరపైకి తెచ్చి బీఆర్ఎస్ను ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ చూస్తుండగా; ప్రజా సమస్యలు, నెరవేరని హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రభుత్వం ఇలాంటి నిర్బంధ చర్యలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగుతోంది. ఎమ్మెల్సీల అరెస్టుతో ప్రారంభమైన ఈ శాసనసభ రగడ రానున్న రోజుల్లో క్షేత్రస్థాయిలో మరింత తీవ్రరూపం దాల్చే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.








