బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చే ధైర్యం సిట్ కు లేదు : బండి సంజయ్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేపర్ లీకేజీకి మంత్రి కేటీఆర్ నిర్వాకమే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీని నిరసిస్తూ ఇందిరాపార్కు వద్ద బీజేపీ చేపట్టిన మా నౌకరీలు మాగ్గావాలే దీక్షలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి సీఎం కేసీఆర్ మాట్లాడటం లేదని, సీఎం కుమారుడు కేటీఆర్ మాత్రమే స్పందిస్తున్నారని విమర్శించారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చే దైర్యం ప్రత్యేక దర్యాప్తు బృందం ( సిట్)కు లేదని అన్నారు. నయీం కేసులో వేసిన సిట్ ఏమైందో సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసు, మియాపూర్ భూములపై వేసిన సిట్ ఏమైందో చెప్పాలన్నారు. లీకేజీ కేసులో పెద్దపెద్ద వాళ్లను వదిలేసి చిన్నవాళ్లను అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. ప్రశ్నపత్రాలు లీక్ అవ్వటం సర్వసాధారణమే అన్న బీఆర్ఎస్ మంత్రికి నోటీసు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.













