బీజేపీ దూకుడును ఓటర్లు సహించలేకపోయారా..?
సింహం నిద్రలేవనంతవరకే ఇతర జంతువుల కుప్పిగంతులు. ఒక్కసారి సింహం నిద్రలేచిందంటే మాత్రం మిగిలినవన్నూ కలుగుల్లోకి వెళ్లాల్సిందే. ఇప్పుడు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే రుజువైంది. వాస్తవానికి ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార టీఆర్ఎస్ కు కలిసిరాలేదు. టీఆర్ఎస్ కూడా ఈ ఎన్నికలను పెద్దగా పట్టించుకునేది కాదు. కానీ ఈసారి మాత్రం టీఆర్ఎస్ వీటిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలే ఇందుకు కారణం. ఈ రెండు చోట్లా బీజేపీ విజయం సాధించడంతో.. ఇక ఉపేక్షించకూడదని భావించింది. అందుకే ఆ పార్టీ అధినేత కేసీఆర్ జూలు విదిల్చారు.
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయంతో మంచి జోష్ మీదున్న బీజేపీ.. ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో కూడా విజయం తమదేనని గట్టిగా నమ్మింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ లో ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న రామచంద్రరావును మళ్లీ బరిలోకి దింపింది. ఇక నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానంలో గుజ్జుల ప్రేమందర్ రెడ్డిని పోటీలో నిలిపింది. హైదరాబాద్ స్థానం తిరిగి తమకే దక్కుతుందని భావించింది. అయితే ఓటర్లు రెండు స్థానాల్లోనూ బీజేపీని ఓడించారు. ఒక స్థానంలో రెండో స్థానం దక్కగా.. ఇంకో స్థానంలో నాలుగో స్థానంలో నిలిచింది.
బీజేపీ ఓటమికి కారణాలేంటో తెలియక ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. పైగా సిట్టింగ్ స్థానాన్ని పోగొట్టుకోవడం వాళ్లకు అస్సలు అర్థం కావట్లేదు. పొరపాటు ఎక్కడ జరిగిందే విశ్లేషించుకునే పనిలో పడ్డారు. టీఆర్ఎస్ పనైపోయింది.. ఇక తమదే భవిష్యత్ అని భావిస్తున్న తరుణంలో ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాయి కమలం శ్రేణులు. టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లన్నీ తమకే పడ్తాయని భావిస్తే.. ఇదేంటి ఇలా జరిగిందని ఆలోచించుకుంటున్నారు. అతి విశ్వాసమే దెబ్బకొట్టిందని కొందరు భావిస్తుంటే.. దూకుడును సహించలేకే ఓటర్లు తగిన బుద్ధి చెప్పారని కొందరు అనుకుంటున్నారు.
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు తర్వాత తెలంగాణ బీజేపీలో దూకుడు పెరిగింది. మఖ్యంగా హిందూ అజెండాని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆ పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇది కూడా ప్రస్తుత బీజేపీ ఓటమికి ఓ కారణంగా విశ్లేషిస్తున్నారు. అంతేకాక.. పెట్రో ధరల పెంపు, తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో కేంద్రం మీనమేషాలు లెక్కించడం.. లాంటి అనేక పరిణామాలు బీజేపీ ముందరి కాళ్లకు బంధమేసాయి.













