కేసీఆర్ దీక్షలను ప్రజలు నమ్మరు : బండి
ఏ రాష్ట్రంలో లేని సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ సృష్టించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్రంలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలనే డిమాండ్‌తో బీజేపీ శ్రేణులు ఇందిరాపార్క్ వద్ద వడ్లు కొను లేదా గద్దె దిగు అనే నినాదంతో చేపట్టిన దీక్షలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఏ చేయలేక ఢిల్లీ కి వెళ్లారని ఎద్దేవా చేశారు. పాలనలో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే అక్కడ ధర్నా చేపడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ దొంగ దీక్షలను ప్రజలు నమ్మరని అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. దొరల గడీల పాలనను బీజేపీ కూల్చుతుందని అన్నారు. ధాన్యం కొనుగోలు చేసే వరకు టీఆర్ఎస్ను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.













