బీజేపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష
బీజేపీ ఎమ్మెల్యేలను సభలోకి అనుమతించే అంశాన్ని పరిశీలించాలన్న హైకోర్టు సూచనలను స్పీకర్ తిరస్కరించడాన్ని నిరసిస్తూ ఇందిరాపార్క్ వద్ద గురువారం (ఈనెల 17వ తేదీన) ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతోందనడానికి, పార్లమెంటరీ సంప్రదాయాలను తుంగలో తొక్కుతోందనేందుకు బీజేపీ ఎమ్మెల్యే సస్పెన్షనే నిదర్శనమన్నారు.
స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సరిదిద్దుకొని ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలంటూ హైకోర్టు సూచించినప్పటికీ పెడచెవిన పెట్టడం అత్యంత హేయమైన చర్య అని అన్నారు. రాజ్యాంగబద్ధంగా, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన స్పీకర్ టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు లాంటిదని ఆక్షేపించారు. రాష్ట్రంలో మంటగలిసిన రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకు బీజేపీ చేపడుతున్న ఈ దీక్షకు ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, విద్యావేత్తలతో పాటు ప్రజా సంఘాల నాయకులంతా మద్దతు ఇవ్వాలని బండి విజ్ఞప్తి చేశారు. ఈ దీక్షలో ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ఎంపీలు సోయం బాపూరావు, ధర్మపురి అర్వింద్, పార్టీ సీనియర్ నేతలు దీక్షలో పాల్గొంటారని పేర్కొన్నారు.













