ఈ కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు
తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని సీఎం కేసీఆర్ కోల్పోయారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్‌ఛుగ్ విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంలో బీజేపీ నేతలపై కేసీఆర్ ఆరోపణలు నేపథ్యంలో ఆయన స్పందించారు. ఢిల్లీ లో తరుణ్‌ఛుగ్ మీడియాతో మాట్లాడుతూ ఈ కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేశారు. ఒక్క ఎమ్మెల్యేను కూడా కొనుగోలు చేయాలని తాము చూడలేదన్నారు. కేసీఆర్ తన పార్టీ గురించి ఆందోళన చెందుతున్నారని, ఫాంహౌస్‌లోనే సినిమా కథ అల్లారని ఆరోపించారు. ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంలో బీజేపీకి సంబంధం లేదని పేర్కొంటూ ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యాదాద్రి ఆలయంలో ప్రమాణం చేశారని తెలిపారు. టీఆర్ఎస్ నేతలు నిజాయితీగా ఉంటే ఎందుకు ప్రమాణం చేయడం లేదని ప్రశ్నించారు. తన పార్టీ గురించి రాత్రి కలలోనూ కేసీఆర్ కంగారుపడుతున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసీఆర్‌కు విశ్వాసం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాపాలకు ప్రజలు తప్పకుండా బదులిస్తారని అన్నారు.













