ప్రపంచంలోనే భారత్ ప్రథమ స్థానం : భారత్ బయోటెక్ చైర్మన్
ప్రపంచ వ్యాప్తంగా చిన్న పిల్లలకు ఇస్తున్న వ్యాక్సిన్లలో 65 శాతం ఇండియాలో ఉత్పత్తి అయిన వ్యాక్సిన్లే ఉన్నాయని పద్మభూషణ్ అవార్డు గ్రహీత, భారత్ బయోటెక్ వ్యవస్థాపక చైర్మన్ కృష్ణ ఎల్ల వెల్లడించారు. హైదరాబాద్లో ఐఐటీ ఆవిర్భావ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. మానవ వనరుల అభివృద్ధిలో భారతదేశం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఇండియాలో డిజిటల్ ఎకానమీ 34 శాతం ఉంటే అభివృద్ధి చెందిన అమెరికా, ప్రాన్స్ వంటి దేశాల్లో 8 శాతం లోపే ఉందని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్, ఫార్మాతదితర రంగాలను ప్రపంచ రాజకీయాలు ఎంతో ప్రభావితం చేస్తున్నాయని కృష్ణ అభిప్రాయపడ్డారు. కొన్ని దేశాలు వ్యాక్సిన్ ఎగుమతి చేసి బదులుగా ఆయా దేశాల నుంచి విలువైన ఖనిజాలను దిగుమతి చేసుకుంటున్నాయని వివరించారు. వ్యవసాయరంగం అభివృద్ధితో పాటు నూతన ఆవిష్కరణలు దేశాన్ని ఆర్థికాభివృద్ధి వైపు నడిపిస్తాయన్నారు. ఇంగ్లిష్ పెద్దగా తెలియని చైనా నూతన ఆవిష్కరణల్లో ముందంజలో ఉందన్నారు.













