119 స్థానాలలో బలమైన అభ్యర్థులను నిలుపుతాం
వచ్చే ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లోనూ బీజేపీ బలమైన అభ్యర్థులను పోటీకి నిలుపుతుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతలు సమావేశం అయ్యారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ 19 నియోజకవర్గాల్లో బహిరంగసభలు పెట్టాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం బూత్ స్థాయి వరకు పనిచేస్తున్నామని అన్నారు. ప్రజాగోస, బీజేపీ భరోసా, స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్తో ప్రజల ముందుకు వెళ్తున్నామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడం తధ్యమంటూ ధీమా వ్యక్తం చేశారు. లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాను అరెస్టు చేస్తే బీజేపీకి ఏంటి సంబంధం అని ప్రశ్నించారు. లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేస్తే స్పందించిన కేసీఆర్ ఆయన కుమార్తె కవితకు సీబీఐ నోటీసులిస్తే ఎందుకు స్పందించలేదని నిలదీశారు. లిక్కర్ కేసులో కవితకు సంబంధాలు ఉన్నాయని సీబీఐ ఛార్జీషీటులో పేర్కొందని గుర్తు చేశారు. అవినీతి పనులు చేస్తే చట్టానికి ఎవరూ అతీతం కాదన్నారు.













