పాత సమస్యలపై ఆందోళన చేస్తే .. కొత్త సమస్యను తెరపైకి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత సమస్యలపై ఆందోళ చేస్తే కొత్త సమస్యను తెరపైకి తెస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. 20 లక్షల మంది నిరుద్యోగులు టీఎస్పీఎస్సీకి దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసుకున్న వారంతా ఏం చేయాలన్నారు. డిగ్రీలు, పీజీలు చదివి ఎంతో మంది ఖాళీగా ఉంటున్నారు. ఎన్నికలు వస్తేనే నోటిఫికేషన్లు అంటూ ఊదరగొడతారు అని అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు డిమాండ్‌తో ఈ నెల 27న ఇందిరా పార్క్ వద్ద ఒక్క రోజు దీక్ష చేస్తామన్నారు. నిరుద్యోగులతో పాటు దీక్షలో పాల్గొంటానని తెలిపారు. ఉద్యోగ సంఘాల నాయకులు ఎవరి కోసం పనిచేస్తున్నారో చెప్పాలి అని నిలదీశారు. సీఎం కేసీఆర్ ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ నియమించిన బిస్వాల్ కమిటీ తెలంగాణలో లక్ష 92 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తేల్చిందని బండి తెలిపారు.













