కొత్తవారికి అవకాశం కల్పించేందుకే… ఇలాంటి ప్రచారం
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేస్తారని చెబుతున్నారని, వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించేందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో మద్యాన్ని తీవ్రంగా ప్రోత్సహిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తాను మాట్లాడే భాషను మార్చుకోవాలన్నారు. వానాకాలం వరి పంటను ఎందుకు కొనడం లేదని, వర్షాకాలం పంటను కొనుగోలు చేయబోమని కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ ఎక్కడా చెప్పలేదన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం కేసీఆర్ కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రధాని మోదీ నాయకత్వాన్ని నమ్మి వచ్చే వాళ్లనే పార్టీలో చేర్చుకుంటామని తెలిపారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వచ్చే నేతలను పార్టీలో చేర్చుకోబోమని స్పష్టం చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగదని పార్లమెంట్ సమావేశాల అనంతరం పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు.













