కనీస బాధ్యత సీఎం కేసీఆర్ కు లేదా? : బండి
ప్రభుత్వ కార్యక్రమం అయినా, ప్రైవేటు కార్యక్రమం అయినా రాష్ట్రానికి వచ్చిన ప్రధానికి స్వాగతం పలకాల్సిన కనీస బాధ్యత సీఎం కేసీఆర్కు లేదా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. హైదరాబాద్లోని ప్రసాద్ ఐమ్యాక్స్ పక్కన ఉన్న స్థలంలో అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం పనుల పురోగతిని బీజేపీ ముఖ్య నేతలతో కలిసి బండి సంజయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సమానత్వం గురించి మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ ఏడేళ్లుగా ప్రధాని మోదీని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. ప్రధాని రాష్ట్రానికి వస్తున్నారంటే సీఎం కేసీఆర్కు జ్వరం వచ్చిందని ఎద్దేవా చేశారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెడతామని కేసీఆర్ 2016లో చెప్పారని, ఇప్పటికీ పనులు పునాదుల దశలోనే ఉన్నాయన్నారు.
అంబేడ్కర్ విగ్రహం పూర్తి కావాలంటే మరో ఐదేళ్లు పట్టేలా ఉందన్నారు. విగ్రహం నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ ఎందుకు పరిశీలించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మోసం చేశారని ధ్వజమెత్తారు. దళితులు ప్రశ్నిస్తారనే భయంతో దళితబంధు తెరపైకి తెచ్చారని, ఇప్పుడు రాజ్యాంగాన్ని తిరగరాయాలంటున్నారని మండిపడ్డారు. రాజకీయ లబ్ధికోసం కేసీఆర్ పన్నాగాలు పన్నుతున్నారని విమర్శించారు.













