పొత్తులు ఉండవ్… ఒంటరిగానే పోటీ
రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సింహంలా సింగిల్గానే పోటీ చేస్తుందని, ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకోబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. ములుగు నియోజకవర్గ స్థాయి పోలింగ్ బూత్ సభ్యుల సమ్మేళన కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పోటీ చేసినా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే గెలుపు అని తేల్చి చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, అధికార బీఆర్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్నారు. అన్ని పార్టీలు కలిసి పనిచేసిన బీజేపీ గెలుపును అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. ఏ సర్వే చూసినా బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. గిరిజనుల సంక్షేమంపై సీఎం కేసీఆర్కు ప్రేమ ఉంటే వారి అభివృద్ధికి ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. పోడు భూముల సమస్యలను పరిష్కరించే ఆలోచన సీఎం కేసీఆర్కు లేదని తేల్చి చెప్పారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రైతులను పట్టించుకోవడం లేదని, ఆయన తెలంగాణ ద్రోహి అని తీవ్ర విమర్శలు చేశారు.













