పొంగులేటి, జూపల్లిపై బీఆర్ఎస్ వేటు.. తదుపరి ప్రయాణమెటు..?
బీఆర్ఎస్ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు సస్పెన్షన్ కు గురయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నరంటూ వాళ్లిద్దరిపై వేటు వేసింది బీఆర్ఎస్ హైకమాండ్. అయితే చాలాకాలం నుంచి వీళ్లిద్దరూ పార్టీకి దూరంగా ఉంటున్నారు. పలు వేదికలపై పార్టీకి వ్యతరేకంగా విమర్శలు గుప్పించారు. అయినా ఇన్నాళ్లూ పట్టించుకోని హైకమాండ్.. ఇప్పుడే ఎందుకు వాళ్లపై వేటు వేసిందనేది ఆసక్తి రేపుతోంది. మరోవైపు వీళ్లిద్దరి తదుపరి ప్రయాణం ఎటు అనేది కూడా తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశమైంది.
వైసీపీ తరపున ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. అయితే 2019 ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వకుండా నామా నాగేశ్వర రావుకు ఇచ్చింది. అయినా పార్టీకి సహకరిస్తూ వచ్చారు పొంగులేటి. రెండోసారి అధికారంలోకి వచ్చాక అయినా పార్టీ తనను పట్టించుకుంటుందని భావించారు. అయితే పార్టీ నుంచి పెద్దగా సానుకూలత రాకపోవడంతో కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. తన అనుచరులను కాపాడుకునేందుకు ఈసారి ఎన్నికల బరిలో దిగబోతున్నట్టు ప్రకటించారు. పొంగులేటి కోసం అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ.. తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకానొక దశలో ఆయన బీజేపీలో చేరడం ఖాయమని అందరూ అనుకున్నారు. అయినా పొంగులేటి ఇప్పటివరకూ అధికారికంగా తాను ఏ పార్టీలో చేరేదీ వెల్లడించలేదు.
ఇక మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో తనపై గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. అప్పటి నుంచి అక్కడ రెండు వర్గాలు తయారయ్యాయి. ఎమ్మెల్యే వర్గానికే హైకమాండ్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని జూపల్లి పలుమార్లు విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో జూపల్లి వర్గీయులే కొల్లాపూర్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. దీన్నిబట్టి జూపల్లికి ఉన్న పట్టేంటో అర్థం చేసుకోవచ్చు. అయినా బీఆర్ఎస్ హైకమాండ్ నుంచి తనకు తగిన ప్రాధాన్యత లభించట్లేదనే ఆవేదన జూపల్లిలో ఉంది. దీంతో కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు.
నిన్న ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి జూపల్లి కృష్ణరావు హాజరు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇద్దరూ బీఆర్ఎస్ పై విమర్శలు కూడా గుప్పించారు. దీన్ని సహించలేని కేసీఆర్.. వాళ్లపై ఇవాళ వేటు వేశారు. అయితే వాళ్లిద్దరూ పార్టీ వీడుతారనే చాలాకాలంగా వినిపిస్తున్నమాటే. అయితే వాళ్లిద్దరూ ఇప్పుడు ఏ పార్టీలో చేరతారనేది ఆసక్తి కలిగిస్తోంది. కాంగ్రెస్, బీజేపీల నుంచి వాళ్లిద్దరికీ ఆహ్వానం ఉంది. అయితే వాళ్లు ఎటువైపు మొగ్గు చూపుతారనేది తెలియాల్సి ఉంది.













