పొంగులేటి, జూపల్లి తెగేదాకా లాగుతున్నారా…?
తెలంగాణలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరతారనే ఉత్కంఠ ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. బీఆర్ఎస్ లో ఉంటూ ఆ పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారనే ఆరోపణలతో వాళ్లిద్దరినీ సస్పెండ్ చేసింది ఆ పార్టీ. అయితే అప్పటికే వాళ్లిద్దరూ పార్టీకి దూరమయ్యారు. ఇక వాళ్లను సస్పెండ్ చేసిన తర్వాత తమ పార్టీలో చేరాలంటూ అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ రెండూ పోటీ పడ్డాయి. ఇప్పటికీ పోటీ పడుతూనే ఉన్నాయి. అయితే వీళ్లిద్దరూ మాత్రం ఇరు పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు కానీ ఇప్పటికీ తేల్చలేదు. దీంతో తెగేదాకా లాగుతున్నారేమో అనిపిస్తోంది.
బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన వెంటనే బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ టీమ్ వెంటనే ఖమ్మం వెళ్లి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావును కలిశారు. తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అయితే అంతకముందు నుంచే పొంగులేటి శ్రీనివాస రెడ్డి బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారు. మునుగోడు ఉపఎన్నిక సమయంలోనే పొంగులేటి బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగింది. ఆ తర్వాత పొంగులేటి ఢిల్లీ వెళ్లి అమిత్ షా సమక్షంలో కమలం కండువా కప్పుకోబోతున్నారని ఊహాగానాలు వినిపించాయి. అయితే అలా జరగలేదు. దీంతో పొంగులేటి మనసులో ఏమందునేదానిపై ఉత్కంఠ కొనసాగింది.
ఇదే సమయంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి విజయమ్మను కలవడం, తాడేపల్లి వెళ్లి జగన్ తో భేటీ కావడంతో సోదరి షర్మిల పార్టీలో పొంగులేటి చేరవచ్చని భావించారు. గతంలో వైసీపీ నుంచే పొంగులేటి ఎంపీగా గెలిచారు. కాబట్టి ఇప్పుడు కూడా తనకు పూర్తిస్వేచ్ఛనిచ్చే షర్మిల పార్టీలో చేరవచ్చని, అందుకే జగన్, విజయమ్మతో భేటీ అయ్యారని అనుకున్నారు. ఇదే సమయంలో కొంతమంది కాంగ్రెస్ నేతలు తమ పార్టీలోకి రావాలని పొంగులేటిని ఆహ్వానించారు. ఇంతలోనే కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీంతో పొంగులేటి, జూపల్లి హస్తం పార్టీ వైపు మొగ్గు చూపారు. రేపోమాపో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.
అయితే అలా కూడా జరగలేదు. మళ్లీ ఈటల రాజేందర్ తో పొంగులేటి, జూపల్లి భేటీ అయ్యారు. దీంతో ఊగిసలాట మళ్లీ మొదలైంది. బీఆర్ఎస్ ను ఓడించే పార్టీలోనే చేరాలని పొంగులేటి భావిస్తున్నారు. అందుకోసం బీజేపీ, కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ కు కేడర్ ఉంది. కేండిడేట్లు ఉన్నారు. కానీ బీజేపీకి కేడర్ లేదు, కేండిడేట్లు కూడా లేరు. కానీ కేంద్రంలో అధికారంలో ఉండడంతో బీఆర్ఎస్ ను ముప్పతిప్పలు పెట్టగలదు. కానీ తెలంగాణలో అధికారంలోకి రావడం మాత్రం కష్టం. ఇలాంటి అంచనాలతో పొంగులేటి, జూపల్లి తర్జనభర్జన పడుతున్నారు. ఏ పార్టీలో చేరాలో తేల్చుకోలేకపోతున్నారు. ఇప్పటికైతే వాళ్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అయితే చివరి నిమిషం వరకూ ఏదైనా జరగొచ్చు.













