కేసీఆర్ టార్గెట్ బీజేపీ.. ముప్పతిప్పలు పెట్టడం ఖాయమా?
తెలంగాణలో పేపర్ లీకేజ్ వ్యవహారం పూర్తిగా రాజకీయమయమైపోయింది. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఆధిపత్యపోరు మరే రేంజ్ కు వెళ్లింది. రెండు పార్టీలూ నువ్వానేనా అన్నట్టు తలపడుతున్నాయి. అయితే బీజేపీని ఇన్నాళ్లు విమర్శలతోనే ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఇకపై చేతల్లో చూపించాలని డిసైడైనట్లుంది. అందుకే బీజేపీ పెద్దలపై సైతం కేసులు పెట్టి లోపలేస్తోంది. దీంతో ఈ వార్ మున్ముందు మరో లెవల్ కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. అటు బీజేపీ కూడా వెనక్కు తగ్గే సూచనలు కనిపించడం లేదు.
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ దే పెత్తనం. ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో కవితను బీజేపీ కక్ష సాధిస్తోందని బీఆర్ఎస్ భావిస్తోంది. బీజేపీని గద్దె దించాలని కేసీఆర్ దేశవ్యాప్తంగా పార్టీని విస్తరిస్తుండడాన్ని జీర్ణించుకోలేకే కవితపై కేసు పెట్టిందని బీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు. కవిత ప్రమేయం లేకపోయినా ఏదో ఒక వంకతో ఆమెను విచారిస్తూ ఇబ్బంది పెడుతున్నారనేది వాళ్ల అభియోగం. అయితే సౌత్ గ్రూపులో కవిత పాత్రధారి అని కేంద్రంలోని బీజేపీ వాదిస్తోంది. ఆ మధ్యే కవిత అరెస్టు ఖాయమని జోరుగా ఊహాగానాలు వినిపించాయి. కానీ ఎందుకో కవిత అరెస్టు వరకూ వెళ్లలేదు ఈడీ. అయినా కవిత అరెస్టు రేపోమాపో ఖాయమని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.
ఇంతలో తెలంగాణలో పేపర్ లీకేజీ వ్యవహారం ప్రకంపనలు మొదలయ్యాయి. బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని పక్షాలూ దీనిపై ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకున్నాయి. బీజేపీ నేరుగా కేటీఆర్ కేంద్రంగానే విమర్శలు గుప్పిస్తోంది. అయితే వరుసగా రెండు రోజులు పేపర్ బయటకు రావడంతో ప్రభుత్వం దీని వెనుక ఏదో కుట్ర ఉందని అనుమానించింది. దీన్ని లోతుగా శోధించి.. పేపర్ ఎవరెవరికైతే వెళ్లిందో వాళ్ల నెంబర్లన్నీ సేకరించింది. ఇందులో బండి సంజయ్, ఈటల రాజేందర్ సహా పలువురు ఉన్నారు. అంతేకాక పేపర్ వాళ్లకు పంపించిన ప్రశాంత్ బీజేపీలో క్రియాశీలకంగా ఉండడంతో బీఆర్ఎస్ కు ఆయుధం దొరికినట్లయింది.
ప్రశాంత్ ఫోన్ తో వివరాలు లాగిన బీఆర్ఎస్.. వెంటనే బండి సంజయ్ ను అరెస్టు చేసింది. ఈటల రాజేందర్ కు నోటీసులు ఇచ్చింది. మరికొంతమంది బీజేపీ నేతలు, కార్యకర్తలకు కూడా నోటీసుల ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. బీజేపీ నేతలు పేపర్ బయటకు తెప్పించారా.. లేదా అనే విషయాన్ని పక్కన పెడితే పేపర్ ను నేరుగా బీజేపీ పెద్దలకు పంపడం, పంపిన వ్యక్తి బీజేపీకి చెందినవాడు కావడం బీఆర్ఎస్ కు అస్త్రంగా మారింది. ఆ అస్త్రాన్నే ప్రయోగించి ఇప్పుడు బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు కేసీఆర్ సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య వార్ ఇప్పట్లో తెగేలా లేదు.













