Etela Rajendar : ఈటల రాజేందర్ పక్కచూపులు చూస్తున్నారా..?

తెలంగాణ కీలక నేతల్లో ఈటల రాజేందర్ (Etela Rajendar) ఒకరు. తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) ఆవిర్భావ నేతల్లో ఆయన ఒకరు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ (KCR) తో కలిసి కీలక పాత్ర పోషించారు ఈటల రాజేందర్. విభజన అనంతరం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈటల రాజేందర్ నెంబర్ టూ నేతగా ఉండేవారు. కేసీఆర్ కూడా ఈటలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. అందుకే తొలివిడత అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు అప్పగించారు. అయితే రెండో విడత అధికారంలోకి వచ్చేనాటికి కేసీఆర్ తో విభేదాలు తలెత్తాయి. అవి ముదిరి పాకాన పడడంతో ఆ తర్వాత పార్టీకీ, పదవికీ రాజీనామా చేసి బీజేపీలో (BJP) చేరారు.
బీజేపీలో చేరిన హుజూరాబాద్ (Huzurabad) ఉపఎన్నికలో పోటీ చేసి విజయం సాధించారు ఈటల రాజేందర్. దీంతో బీజేపీ హైకమాండ్ కు ఆయనపై నమ్మకం ఏర్పడింది. ఆయన కూడా హైకమాండ్ అడుగుజాడల్లో నడిచారు. కేసీఆర్ ను ఎదుర్కొనే దమ్మున్న నేత దొరికాడని అందరూ భావించారు. దీంతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పై గజ్వేల్ (Gajwel) లో బరిలోకి దిగారు ఈటల. అయితే అక్కడ ఓడిపోయారు. దీంతో ఈటలకు అంత సీన్ లేదనుకున్నారు. అనంతరం 2024 లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి (Malkajgiri) స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఈటల సత్తా ఏమాత్రం తగ్గలేదని అందరూ అనుకున్నారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం, రాష్ట్రం నుంచి ఎంపీగా గెలవడంతో తనకు తప్పకుండా తగిన ప్రాధాన్యత దక్కుతుందని ఈటల రాజేందర్ భావించారు. అయితే తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి మాత్రమే మంత్రివర్గంలో స్థానం దక్కింది. ఈటలకు ఛాన్స్ మిస్ అయింది. బీఆర్ఎస్ (BRS) నుంచి వచ్చిన కొంతకాలానికే రాష్ట్ర అధ్యక్ష పదవి ఈటలకు దక్కుతుందనుకున్నారు. ఇప్పుడు ఆ పార్టీ తరపున ఎంపీగా ఎన్నిక కావడం, మంత్రిపదవి కూడా దక్కపోవడంతో కచ్చితంగా అధ్యక్ష పదవి ఇస్తారని ఆశించారు. అయితే అది కూడా ఇప్పుడు నెరవేరేలా కనిపించడం లేదనే వార్తలు వస్తున్నాయి.
ఈటల రాజేందర్ వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తి. గతంలో PDSUలో పనిచేశారు. ఇలాంటి వ్యక్తికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని కొంతమంది నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. RSS బ్యాక్ గ్రౌండ్ కలిగిన నేతలు ఈటలకు ఈ పదవి ఇవ్వడానికి ససేమిరా అంటున్నారట. దీంతో ఈటలకు అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే అవకాశం లేదని ఆయనకు సమాచారం చేరవేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈటల కాస్త అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. అందుకే పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనట్లేదు. ఇటీవల బహిరంగంగానే కాస్త అసంతృప్త స్వరం కూడా వినిపించారు. దీంతో ఈటల రాజేందర్ పార్టీ మారతారేమోనని కొంతమంది ఆయన అనుచరులు భావిస్తున్నారు. పైగా అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ నుంచి ఈటలకు ఎప్పుడూ గ్రీన్ సిగ్నల్ ఉంటుందని చెప్పుకుంటున్నారు.