తెలంగాణ బీజేపీలో లుకలుకలు..! బండి, ఈటల మధ్య గ్యాప్ పెరిగిందా..?
తెలంగాణ బీజేపీలో చాలాకాలం నుంచి నేతల మధ్య విభేదాలున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో లాగా నేతలు బహిరంగంగా మాత్రం కామెంట్స్ చేయరు. అందుకే ఎన్ని విభేదాలున్నా బయటకు మాత్రం కనిపించవు. కానీ అప్పుడప్పుడు నేతలు నోరు జారుతుంటారు. దీంతో బుక్ అయిపోతుంటారు. ఇప్పుడు ఈటల రాజేందర్ విషయంలో బండి సంజయ్ చేసిన కామెంట్స్ కూడా వాళ్లిద్దరి మధ్య గ్యాప్ ఉందని చెప్పేశాయి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. పార్టీని నడిపిస్తున్న నేత. ఇక ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేరికల కమిటీకి ఛైర్మన్. కొత్తగా బలమైన వారిని పార్టీలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో అధిష్టానం చేరికల కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే పలువురు నేతలతో ఈ కమిటీ సంప్రదింపులు జరిపి పార్టీలోకి తీసుకువచ్చింది. ఇప్పుడు కూడా ఆ పనిలో ఉంది. అయితే ఈ కమిటీలన్నీ రాష్ట్ర అధ్యక్షుడి పరిధిలోనే పని చేస్తుంటాయి. కమిటీలు ఎవరినైనా కీలక నేతలను పార్టీలోకి ఆహ్వానించేటప్పుడు అగ్రనేతలు చర్చించుకోవడం ఆనవాయితీ.
రాష్ట్రంలో కొంతకాలంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేరు మార్మోగుతోంది. ఖమ్మం జిల్లాలో కీలక నేత ఆయన. పొంగులేటిని తమ పార్టీలోకి రావాలంటూ ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. రెండు పార్టీల్లో దేనిలో చేరేది పొంగులేటి ఇంతవరకూ చెప్పలేదు. ఆయనతో మాత్రం రెండు పార్టీలూ టచ్ లో ఉన్నాయి. తాజాగా బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్.. ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మరో కీలక నేత జూపల్లి కృష్ణారావు కూడా పాల్గొన్నారు. వీళ్లిద్దరూ ఇటీవలే బీఆర్ఎస్ నుంచి బయటికొచ్చారు. ఇద్దరు తమ తమ జిల్లాల్లో పట్టున్న నేతలు కావడంతో వీళ్లను చేర్చుకునేందుకు బీజేపీ ఆసక్తి చూపిస్తోంది.
అయితే పొంగులేటితో ఈటల భేటీకి సంబంధించిన సమాచారం పార్టీ అధినేత బండి సంజయ్ కు తెలియకపోవడం విశేషం. పొంగులేటిని ఈటల కలవడం మీడియా అడిగినప్పుడు.. అసలు తనకు ఆ విషయం తెలియదన్నారు. దీన్ని బట్టి వాళ్లిద్దరి మధ్య గ్యాప్ ఉందని అర్థమైపోయింది. అయితే చేరికల కమిటీ ఛైర్మన్ గా ఎవరినైనా కలిసే అధికారం ఈటలకు ఉంటుందని, అలా కలవడం తప్పు కాదని కవర్ చేసే ప్రయత్నం చేశారు. అయితే వీళ్లద్దరి మధ్య విభేదాలున్నాయని, ఈటలను బండి కేర్ చేయట్లేదని చాలాకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు బండి సంజయ్ కామెంట్స్ తో ఆ విషయం మరోసారి రుజువైంది.













