బండి సంజయ్ అరెస్ట్..! తెలంగాణలో నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిన బీజేపీ, బీఆర్ఎస్ వార్..!!
తెలంగాణలో టెన్త్ పేపర్ లీకేజ్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. పేపర్ల లీకేజీ వెనుక బీజేపీ చీఫ్ బండి సంజయ్ హస్తముందని అధికార బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకు తగ్గట్టే బండి సంజయ్ ని అరెస్టు చేయడంతో ఈ వ్యవహారం పెద్ద సంచలనంగా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ ఓ రేంజ్ లో సాగుతోంది. ఇప్పుడు బండి సంజయ్ అరెస్టుతో ఈ యుద్దం మరో లెవల్ కి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
తెలంగాణలో వరుసగా రెండు రోజులు రెండు పేపర్లు లీక్ కావడం పెద్ద సంచలనానికే కారణమైంది. తొలి రోజు తెలుగు పేపర్ లీక్ అయిన వెంటనే ఓ ఇన్విజిలేటర్ తప్పిదం వల్లే ఇలా జరిగిందని అందరూ భావించారు. కొందరు ఉద్యోగులపై చర్యలు తీసుకోవడంతో పరిస్థితి చక్కబడుతుందని విద్యాశాఖాధికారులు అనుకున్నారు. అయితే రెండో రోజు హిందీ పేపర్ కూడా లీక్ కావడంతో దీని వెనుక ఏదో కుట్ర ఉందని విద్యాశాఖాధికారులు అనుమానించారు. దీన్ని లోతుగా విచారణ జరిపిన తర్వాత ఇది కుట్రేనని తేల్చారు. హిందీ పేపర్ లీక్ చేసిన ప్రశాంత్ అనే వ్యక్తి బీజేపీ కార్యకర్త అని, నేరుగా బండి సంజయ్ తోనే టచ్ లో ఉన్నాడని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
బండి సంజయ్ తో ప్రశాంత్ చాట్ చేశాడని, అంతేకాక వందకు పైగా కాల్స్ చేశాడని పోలీసులు చెప్తున్నారు. వాళ్లిద్దరి మధ్య చాటింగ్ ను డిలీట్ చేసినట్లు గుర్తించిన పోలీసలు.. దాన్ని రిట్రీవ్ చేసినట్లు సమాచారం. దీని ఆధారంగానే బండి సంజయ్ ని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. మరోవైపు కేటీఆర్ కూడా పేపర్ లీకేజ్ వెనుక బీజేపీ నేతల హస్తముందని ట్వీట్ చేశారు. ఇలాంటి పిచ్చోళ్ల చేతిలో పార్టీ ఉంటే రాష్ట్రానికే ప్రమాదమని తెలిపారు. పేపర్ లీకేజ్ వెనుక ఎవరున్నా వదిలేదని లేదని స్పష్టం చేశారు.
అయితే బండి సంజయ్ అరెస్టు కుట్ర అని బీజేపీ వాదిస్తోంది. పేపర్ లీకేజ్ లను అరికట్టడం చేతకాక ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎంతమందిని అరెస్టు చేసినా తామ తగ్గే ప్రశ్నే లేదని స్పష్టం చేస్తున్నారు. బండి సంజయ్ అరెస్టుపై ఇప్పటికే బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. మరోవైపు బీజేపీ అధిష్టానం కూడా ఎప్పటికప్పుడు బండి సంజయ్ అరెస్టుపై ఆరా తీస్తోంది. మొత్తానికి బండి సంజయ్ అరెస్టు వ్యవహారంతో బీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ మరో రేంజ్ కి వెళ్లింది.













