భారత్ బయోటెక్ లో విదేశీ ప్రతినిధులు
కరోనా టీకాల తయారీపై అధ్యయనానికి 64 దేశాల రాయబారులు, హైకమిషనర్లు హైదరాబాద్‌కు చేరుకున్నారు. భారత్‌లో టీకాల పురోగతిని వివరించేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ పర్యటన ఏర్పాటు చేసింది. వారు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శామీర్‌పేట వద్ద గల జినోమ్‌వ్యాలీకి వెళ్లారు. రెండు బృందాలుగా వీరు పర్యటించారు. మొదటి బృందంలోని వారు భారత్ బయోటెక్ లిమిటెడ్‌ను సందర్శించారు. టీకాల తయారీపై దృశ్యరూపక ప్రదర్శనను తిలకించారు. విదేశీ రాయబారులకు కొవాగ్జిన్ టీకా వివరాలను భారత్ బయోటెక్ సంస్థ చైర్మన్ కృష్ణ ఎల్లా వివరించారు.
రెండో బృందం బయోలాజికల్- ఇ సంస్థను సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు టీకాల తయారీ సామర్థ్యంపై ఇచ్చే దృశ్యరూపక ప్రదర్శనను తిలకించింది. అక్కడి నుంచి భారత్ బయోటెక్ లిమిటెడ్‌కు చేరుకుని, అక్కడ శాస్త్రవేత్తలతో రాయబారులు, హైకమిషనర్లు భేటీ అవుతారు. టీకాల తయారీపై దృశ్యరూపక ప్రదర్శనను తిలకిస్తారు. పెద్ద సంఖ్యలో విదేశీ రాయబారులు, హైకమిషనర్లు తెలంగాణను సందర్శించడం ఇదే ప్రథమం. వారి పర్యటనను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.













