అమెరికా పంపిన జాబితాను అంగీకరించలేదు : సుష్మా
భారతీయ అక్రమ వలసదారుల పేరిట అమెరికా 271 మందితో కూడిన జాబితాను అందించిందని, కానీ ప్రభుత్వం దాన్ని అంగీకరించలేదని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ రాజ్యసభకు తెలిపారు. జాబితాపై మరిన్ని వివరాలు కావాలని అడిగామని, నిజానిజాలను పూర్తిగా ధ్రువీకరించుకున్నాకే వారి బహిష్కారానికి అనుమతిస్తామన్నారు. ఐటీ నిపుణులతో పాటు అక్కడ నివసిస్తున్న భారత పౌరుల విషయంలో ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఎంపీలు శూన్యగంట సమయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సుష్మా స్వరాజ్ స్పందిస్తూ ట్రంప్ అధికారలోకి వచ్చిన తర్వాత అమెరికా విధానాలు మారాయనటం సరికాదన్నారు. హెచ్1బీ, ఎల్1 వీసాలకు సంబంధించి నాలుగు బిల్లులను అమెరికా కాంగ్రెస్లో ప్రవేశపెట్టారని, అవేవీ ఆమోదం పొందలేదని తెలిపారు. అమెరికాలో మనవాళ్ల ప్రయోజనాలను కాపాడటానికి అత్యున్నత స్థాయి అధికారులతో ప్రభుత్వం సంప్రదిస్తోందని వెల్లడించారు. మన ఐటీ నిపుణులు అక్కడి ఉద్యోగాలను కొల్లగొట్టడం లేదని, అమెరికా ఆర్థికవ్యవస్థ మరింత పరిపుష్టం కావటానికి తోడ్పడుతున్నారని చెప్పామని వివరించారు.













