తెలంగాణను ఏటీఎంగా మార్చిన కాంగ్రెస్.. ప్రశ్నించని బీఆర్ఎస్: కల్వకుంట్ల కవిత
Kalvakuntla Kavitha: తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త మార్పునకు నాంది పలుకుతూ ఈ నెల 25న కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. రాష్ట్ర భవిష్యత్తును మార్చే దిశగా, యువ రక్తం , వినూత్న ఎజెండాతో తాము ప్రజల ముందుకు రాబోతున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గద్వాల నియోజకవర్గానికి చెందిన ‘నడిగడ్డ హక్కుల పోరాట సమితి’ అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్ తన అనుచరులతో కలిసి జాగృతిలో చేరారు. కవిత వారికి కండువా కప్పి సంస్థలోకి ఆహ్వానించారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై విమర్శలు:
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై స్పందిస్తూ.. బీఆర్ఎస్ పార్టీ నిద్రావస్థలో ఉందని, ప్రజల సమస్యలపై స్పందించడం లేదని కవిత విమర్శించారు. అటు అధికార కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చేసిందని, అబద్ధపు హామీలతో ప్రజలను వంచిస్తోందని మండిపడ్డారు. గద్వాల ప్రాంతంలోని చేనేత కార్మికులు, పత్తి రైతులకు అన్యాయం జరుగుతున్నా అడిగే వారు కరువయ్యారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యమ జెండా ఎగురుతుంది:
రాబోయే రోజుల్లో సమస్యలపై పోరాడే శక్తిగా తమ పార్టీ నిలుస్తుందని కవిత ధీమా వ్యక్తం చేశారు. ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుతో ఇప్పటికే జోగులాంబ జిల్లాలో జాగృతి విజయం సాధించిందని గుర్తు చేస్తూ.. భవిష్యత్తులో గద్వాల గడ్డపై ఉద్యమకారుల జెండా ఎగరడం ఖాయమని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.






