రికార్డు సృష్టించిన రిలయన్స్ ఇండస్ట్రీస్
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు నేటి ట్రేడింగ్‌లో కొత్త శిఖరాలకు చేరింది. ఒక దశలో 3.4 శాతం లాభపడి రూ.1,508.45కు చేరింది. దేశంలోని తొలిసారి రూ.9.5 లక్షల కోట్ల మార్కెట్ విలువను దాటిన సంస్థగా రికార్డు సృష్టించింది. దీంతో రూ.10 లక్షల కోట్ల వైపు పరుగులు పెడుతోంది. అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న సంస్థగా రిలయన్స్ నిలిచింది. రెండో స్థానంలో ఉన్న టీసీఎస్ మార్కెట్ విలువ రూ.7లక్షల కోట్లు. ఈ ఏడాది రిలయన్స్ షేరు ధర 35 శాతం వరకు వృద్ధి చెందింది. 1966లో రిలయన్స్‌ను రూ.1000 మూలధనం, ఒక ఉద్యోగితో ధీరుభాయ్ అంబానీ ప్రారంభించారు. ఆ తర్వాత దానిని ఆయన ప్రపంచ స్థాయి వ్యాపార దిగ్గజంగా తీర్చిదిద్దారు. ఆయన తన కలను వాస్తవం చేసుకొన్నారు. 1977లో ఐపీవోకు వచ్చింది. ఆ తర్వాత నుంచి ప్రతి రెండున్నరేళ్లకు రిలయన్స్ షేరు విలువ రెట్టింపవుతూ వస్తోంది.













