సూపర్‌స్టార్ ఆ దేశానికి వెళ్లకూడదు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ శ్రీలంక పర్యటనను రద్దు చేసుకోవాలని డీపీఐ ప్రధానకార్యదర్శి తిరుమావళవన్ డిమాండ్ చేశారు. శ్రీలంకలో నివసిస్తున్న తమిళులకు లైకా సంస్థ ఆధ్వర్యంలో 150 కొత్త ఇళ్లను నిర్మించారు. వీటిని లబ్ధిదారులకు పంపిణీ చేసే కార్యక్రమం ఏప్రిల్ 9న జరుగనుంది. ఈ కార్యక్రమంలో రజనీకాంత్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని లైకా సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో నగరంలో మీడియాతో మాట్లాడిన తిరుమావళవన్, లక్షలాది మంది తమిళులను ఊచకోతకు గురి చేసిన శ్రీలకం ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు ఖండించాయన్నారు. కళాకారులు ప్రజలను సంతోషపెట్టే వారుగా ఉండాలని, తమిళులు వ్యతిరేకిస్తున్న శ్రీలంక గడ్డపై తమిళ సూపర్‌స్టార్ కాలుమోపరాదని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.













