తెలుగు రాష్ట్రాల ‘తాగుడు’ మూతలు…
తాంబూలాలిచ్చాం తన్నుకుచావండి అన్న సామెతను నిజం చేసింది కేంద్ర ప్రభుత్వం. పంజాబ్ వంటి పలు రాష్ట్రాల విజ్ఞప్తులు, కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు అతి తక్కువగా ఉన్న పరిస్థితులను బేరీజు వేసుకుని మద్యం విక్రయాలకు ‘గ్రీన్’జెండా ఊపేసింది. దీంతో ఓవైపు కరోనా భయాలు, మరోవైపు రాష్ట్రానికి ఆదాయం పోతుందే గుబులు మధ్యనే ఒక్క కేరళ తప్ప మిగిలిన రాష్ట్రాలన్నీ దొరికిందే సందని మద్య ప్రవాహాలకు గేట్లెత్తాయి. ఇదే క్రమంలో తెలుగు రాష్ట్రాలు సైతం మద్యం విక్రయాలుకు జై కొట్టాయి. అయితే ఈ రెండు రాష్ట్రాలూ కేంద్ర ఆదేశాలతో తమదైన శైలిలో దాగుడు…మూతలు ఆడడం విశేషం.
కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా అంటూ ఆంధ్రప్రదేశ్ తొలిగా 4నుంచే వైన్షాప్స్కి తాళాలు తీసింది. మద్యం విక్రయాలు గ్రీన్ జోన్ జిల్లాలకు మాత్రమే పరిమితం కావాలని కేంద్రం సూచించింది. దీని ప్రకారం ఆంధ్ర ప్రదేశ్లో ఒక్క విజయనగరం జిల్లా మాత్రమే వైన్ షాప్స్ ప్రారంభించడానికి అర్హత ఉంది. అయితే కేంద్ర ఆదేశాలను తమకు అనువుగా మలచుకున్న ఆంధ్ర…జోన్ల విభజనకు మండలాలను ఆధారం చేసుకుంది. దాని ప్రకారం చూస్తే ఎపిలో ఉన్న 676 మండలాల్లో దాదాపు 500కిపైగా మండలాలు గ్రీన్ జోన్ల పరిధిలోకి వస్తాయి. మిగిలిన 100 పై చిలుకు మండలాలు మాత్రమే రెడ్, ఆరెంజ్ జోన్లుగా ఉన్నాయి. ఈ తరహా విభజన వల్ల ఏపీలో అత్యధిక సంఖ్యలో వైన్ షాప్స్ తెరుచుకున్నాయి.
ఇక లాక్ డవున్ ప్రకటించిన దగ్గర్నుంచి నువ్వు ఒకడుగేస్తే నేను మూడడుగులు వేస్తా అన్నట్టు కేంద్రంతో పోటీపడుతున్న తెలంగాణ ప్రభుత్వం కేంద్రం ఈ నెల 3 దాకా లాక్డవున్ ప్రకటిస్తే తాను 7కి దాన్ని పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో పరిస్థితిని సమీక్షించడానికి గత మంగళవారం తమ మంత్రులతో సమావేశమైన తెలంగాణ సిఎం కేసియార్ అనంతరం తమ రాష్ట్రంలో లాక్ డవున్ ఈ నెల 29వరకూ ఉంటుందని మీడియా సమావేశంలో ప్రకటించారు. అలాగే బుధవారం నుంచీ మద్యం విక్రయాలకు తమ రాష్ట్రంలోనూ పచ్చజెండా ఊపేశారు. అంతేకాదు ఎపి కన్నా మరో అడుగు ముందుకేసి కేంద్రం అనుమతించిన గ్రీన్ జోన్లలో మాత్రమే కాకుండా రెడ్ జోన్లలో కూడా విక్రయాలకు ఆయన నిర్ణయించడం విశేషం. సిఎం కేసియార్ నిర్ణయం ప్రకారం తెలంగాణ లోని 2వేల పై చిలుకు మద్యం షాపులు బుధవారం తెరచుకున్నాయి. కేవలం కంటైన్మెంట్ జోన్లుగా పేర్కొన్న ప్రాంతాల్లోని 15 షాపులు మాత్రమే విక్రయాలకు నోచుకోలేదు. మొత్తం మీద ఇరు రాష్ట్రాలూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను తమకు అనువుగా ఒకరు, తమకు నచ్చినట్టుగా మరొకరు మార్చుకుంటూ మద్యం విక్రయాలను షురూ చేసేశారు.













