వీఐటీ విద్యార్థికి రూ.63 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం
వీఐటీ ఏపీ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థి సుధాన్షు దొడ్డి రూ.63 లక్షల ప్యాకేజీతో అంతర్జాతీయ ఉద్యోగం సంపాదించారు. అమెరికాకు చెందిన ప్రముఖ అనలిటిక్స్ కంపెనీలో బీటెక్ సీఎస్ఈ చదువుతున్న విద్యార్థి ఉద్యోగం సాధించారని వీఐటీ వైస్ చాన్సరల్ ఎస్వి కోటరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అత్యుత్తమ విద్యా విధానాలు, విద్యార్థుల ఆకుంఠిత దీక్ష వల్లే ఇలాంటి అనితర సాధ్యమైన విజయాలను సాధిస్తున్నామని వివరించారు. ప్రపంచానికి బాధ్యత గల రేపటితరం నాయకులను అందించడానికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 24 నాటికి 627 మంది విద్యార్థులకు 1,175 ఉద్యోగావకాశాలు లభించాయని తెలిపారు. ఇందులో 245 సూపర్ డ్రీం ఆఫర్లు కాగా, 354 డ్రీం అఫర్లున్నాయని తెలిపారు. ఈ ఏడాది సరాసరి పారితోషికం గతేడాదితో పోలిస్తే రూ.6.77 లక్షల నుంచి రూ.7.3 లక్షలకు పెరిగిందని వివరించారు. ఈ ఉద్యోగ ఎంపిక ప్రక్రియలో దాదాపు 805 బహుళజాతి సంస్థలు పాల్గొన్నాయని కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ డైరెక్టర్ వి శామ్యూల్ రాజ్‌కుమార్ తెలిపారు.













