డిజిటల్ యూజర్లకు బిగ్ రిలీఫ్, ఉచిత సేవలు కంటిన్యూ..!
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన యూపీఐ (UPI) నగదు బదిలీలపై త్వరలోనే అదనపు బాదుడు షురూ కాబోతోందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ముమ్మర ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం తెరదించింది. సాధారణ కస్టమర్లలో నెలకొన్న గందరగోళాన్ని నివృత్తి చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక స్పష్టమైన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డిజిటల్ ఆర్థిక లావాదేవీలను మరింత బలోపేతం చేసే దిశగా బ్యాంకులకు, పేమెంట్ గేట్‌వే సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఈ కొత్త నిబంధనల ప్రకారం… నిత్యం సామాన్యులు జరిపే రూ. 2,000 లోపు యూపీఐ (UPI) లావాదేవీలపై ఎలాంటి ప్రత్యక్ష లేదా పరోక్ష అదనపు రుసుములు వసూలు చేయడానికి వీల్లేదు. దీనితో పాటు స్వదేశీ నెట్వర్క్ అయిన ‘రూపే (RuPay) డెబిట్ కార్డు’ ద్వారా జరిపే డిజిటల్ చెల్లింపులను కూడా ఈ ఉచిత పరిధిలోనే ఉంచారు. డబ్బులు పంపే కస్టమర్ కానీ, వాటిని అందుకునే చిన్న వ్యాపారులు కానీ రూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మరోవైపు, బంధుమిత్రులకు లేదా ఇతరుల అకౌంట్లకు నేరుగా నగదు బదిలీ చేసే పర్సన్-టు-పర్సన్ యూపీఐ పేమెంట్స్ ఎప్పటిలాగే పూర్తిగా ఉచితంగా సాగనున్నాయి. దేశంలో నెలకు వేల కోట్ల సంఖ్యలో జరుగుతున్న డిజిటల్ లావాదేవీల రక్షణ, బ్యాంకుల మౌలిక సదుపాయాల భద్రత కోసమే రూ. 2,000 పరిమితితో కూడిన లీగల్ ఫ్రేమ్‌వర్క్‌ను తెచ్చారే తప్ప, వినియోగదారులపై ఎలాంటి భారాలు వేయలేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ తాజా ప్రకటనతో కోట్లాది మంది యూపీఐ యూజర్లకు పెద్ద ఊరట లభించింది.








