మంత్రి కొండపల్లిని కలిసిన చిన్న శ్రీను..!
విజయనగరం జిల్లా రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు సరికొత్త మలుపు తీసుకున్నాయి. వైఎస్సార్సీపీని వీడి అధికార తెలుగుదేశం పార్టీలో చేరిన విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మంగళవారం రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను(Kondapalli Srinivas) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. వారం రోజులుగా జిల్లా రాజకీయాల్లో ఊహించని మార్పు వచ్చిందని, చిన్న శ్రీను లాంటి బలమైన నేత టీడీపీలోకి రావడాన్ని తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు.
ఆయన చేరికతో విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ మరింత పటిష్టమవుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఈ భేటీ అనంతరం మజ్జి శ్రీను తన రాజకీయ నిర్ణయంపై స్పష్టతనిచ్చారు. తాను ఎలాంటి స్వార్థంతో కాకుండా, కేవలం ఉత్తరాంధ్ర ప్రాంత ప్రయోజనాలు, అభివృద్ధిని కాంక్షించే తెలుగుదేశం పార్టీలో చేరినట్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకునే ప్రజాహిత నిర్ణయాలను, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడానికి అందరితో కలిసి, సమన్వయంతో పనిచేస్తానని చెప్పారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి తరఫున అత్యధిక మెజార్టీ స్థానాలను సాధించడమే తమ తక్షణ లక్ష్యమని, ఇందుకోసం పార్టీ కార్యకర్తలు కూడా నిరంతరం కష్టపడాలని పిలుపునిచ్చారు. అలాగే, 2029 సాధారణ ఎన్నికల్లో మళ్లీ డబుల్ ఇంజిన్ సర్కార్‌ను అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా పనిచేస్తానని ప్రకటించారు. నిన్నటివరకు జిల్లా పరిషత్ సమావేశాల్లో తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకున్న నేతలు, ఈరోజు ఒకే వేదికపై కలిసి పనిచేస్తామని ప్రకటించడం జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ కలయికతో పాత విభేదాలన్నీ పక్కన పెట్టి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.








