విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం..!
విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ (PNBS) ఆవరణలో మరియు కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమవ్వడం తీవ్ర కలకలం రేపింది. అప్రమత్తంగా వ్యవహరించిన ఒక ప్రయాణికుడు అందించిన సమాచారంతో కృష్ణలంక పోలీసులు ఏకంగా 46 జిలెటిన్ స్టిక్స్, 50 ఎలక్ట్రానిక్ డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఎల్లప్పుడూ వేలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే విజయవాడ బస్టాండ్ సమీపంలో ఇంత పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు దొరకడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆసిఫ్ అలీ అనే వ్యక్తి పల్నాడు జిల్లా నరసరావుపేట నుంచి బస్సులో విజయవాడకు వచ్చాడు. విజయవాడ బస్టాండ్‌కు చేరుకున్న తర్వాత, బస్సులో తన బ్యాగ్‌కు బదులుగా మరొకరి బ్యాగ్ మారిపోయి ఉండటాన్ని అతను గమనించాడు. తన వస్తువుల కోసం ఆసిఫ్ అలీ ఆ వేరే వ్యక్తి బ్యాగ్‌ను తెరిచి చూడగా, అందులో ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు కనిపించడంతో అతను తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆసిఫ్ అలీ వెంటనే బస్టాండ్‌లోని పోలీస్ అవుట్‌పోస్ట్‌కు వెళ్లి అధికారులకు సమాచారం అందించాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న కృష్ణలంక పోలీసులు ఆ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఈ 46 జిలెటిన్ స్టిక్స్, 50 ఎలక్ట్రానిక్ డిటోనేటర్లను ఎక్కడి నుంచి తీసుకువచ్చారు..? వీటిని ఎక్కడికి తరలిస్తున్నారు..? దీని వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితులను గుర్తించేందుకు సదరు బస్సులో ప్రయాణించిన ఇతర ప్రయాణికుల వివరాలను సేకరించడంతో పాటు, బస్టాండ్ పరిసరాల్లోని సీసీటీవీ (CCTV) కెమెరాల ఫుటేజీలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కృష్ణలంక పోలీసులు సూచించారు.








