ఈ ఆంక్షలు తీసేసి.. అర్హులందరికీ ఇవ్వాలి : నారా లోకేశ్

అమ్మఒడి పథకాన్ని కాస్త అర్థఒడిగా మార్చారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కన్న తల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. తేదీల మతలబుతో ఒక ఏడాది ఎగ్గొట్టి, మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో 1000 రూపాయలు కోతపెట్టరన్నారు. 300 యూనిట్లు దాటి విద్యుత్ వాడినా, విద్యార్థికి 75 శాతం హాజరు లేకపోయినా అమ్మ ఒడికి అనర్హులుగా ప్రకటించడం దారుణమన్నారు. కొత్త జిల్లాల్లో ఆధార్‌తో నమోదు చేసుకోవాలని, కొత్త బియ్యం కార్డు ఉంటేనే అమ్మఒడి ఇస్తామని ముందే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే రూ.30 వేలు వేస్తామని ఇచ్చిన హామీని కూడా గంగలో కలిపేశారని మండిపడ్డారు. అమ్మలని మానసిక క్షోభకి గురిచేసే ఈ ఆంక్షలు తేసేసి అర్హులందరికీ అమ్మ ఒడి ఇవ్వాలని డిమాండ్ చేశారు.