ఆధునిక ఉక్కు మనిషి ప్రధాని మోదీ వజ్రసంకల్పం నెరవేరాలి : మంత్రి లోకేష్
25 ఏళ్ల ప్రజా సేవా శిఖరానికి నమో
వెంకటపాలెం వెంకటేశ్వరస్వామి ఆలయంలో మంత్రి నారా లోకేష్ పూజలు
అమరావతి: దేశ శ్రేయస్సు-ప్రజాసంక్షేమమే లక్ష్యంగా 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానం పూర్తి చేసుకున్న ఆధునిక ఉక్కుమనిషి ప్రధాని నరేంద్ర మోదీకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ప్రధాని వికసిత్ భారత్ వజ్రసంకల్పం నెరవేరాలని ప్రార్థిస్తూ అమరావతిలోని వెంకటపాలెం వెంకటేశ్వరస్వామి ఆలయంలో మంత్రి నారా లోకేష్ పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్నారు. 2001 అక్టోబరు 7వ తేదీన గుజరాత్ ముఖ్యమంత్రిగా మొదలైన మోదీ గారి ప్రస్థానం నేటితో 25 ఏళ్లు (రజతోత్సవం) పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పేరు మీద వెంకటపాలెం ఆలయంలో లోకేష్ పూజలు చేశారు. ప్రపంచంలోనే మన దేశం అన్నిరంగాల్లో నెంబర్ వన్‌గా ఉండాలనే లక్ష్యంతో నిస్వార్థంగా పనిచేస్తున్న ఆధునిక ఉక్కుమనిషి నరేంద్ర మోదీ గారికి ఆ శక్తియుక్తులన్నీ దేవుడు ప్రసాదించాలని లోకేష్ ప్రార్థించారు. మోదీ ప్రజాసేవా ప్రస్థానాన్ని దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ యాత్రగా నిర్వహించడం దేశాభివృద్ధి కోసం ప్రధాని చేస్తున్న కృషికి నిదర్శనం అని లోకేష్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.








